తెలంగాణలో రేసులో లేని బీజేపీ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

-

.తెలంగాణలో బీజేపీ సైడైపోయిందా
.బండి సంజయ్ వ్యాఖ్యల్లో మర్మం ఏంటి
.రెండవ స్థానంలోకి కాంగ్రెస్ రావడానికి కారణమేంటి
.ప్లాన్ మార్చేసిన సీఎం కేసీఆర్

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. అప్పటివరకు బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ ఉన్నట్టుండి మూడో ప్లేసుకి పడిపోయింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత తెలంగాణాలో ఇక బీజేపీ హవా మొదలైనట్లే అనుకున్నారు అందరూ. ఇదే క్రమంలో ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ పై మాటల దూకుడు పెంచారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి అధికార పార్టీకి గట్టి పోటీ ఉంటుందనే ఊహించారు అంతా. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఇక్కడ కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. దీంతో బీజేపీ సైడై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతుంది. అంతకు ముందు తెలంగాణాలో ప్రధానంగా బిజెపిని మాత్రమే టార్గెట్ చేసిన బీఆర్ఎస్ ప్రస్తుతం బిజెపిని పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.

బీజేపీకి ప్రాధాన్యత తగ్గించడానికి బీఆర్ఎస్ వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇటీవల మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనిని సీఎం కేసీఆర్ స్ట్రాటజీగా పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దాదాపుగా ఉనికిని కోల్పోయి మనుగడ కష్టం అనుకుంటున్న నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితి బీజేపీ ని సైడయ్యేలా చేసింది.అయితే ఇప్పుడు తమకు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ నే అన్న చందంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను పదేపదే టార్గెట్ చేస్తున్నారు. దీంతో బీజేపీకి తెలంగాణలో ప్రాధాన్యత లేదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ పధకాలను కొనసాగిస్తామని చెప్తూ లోపాలను సరిదిద్దుతామని సెలవిచ్చారు. ప్రాధాన్యం తగ్గిన బీజేపీ ని మళ్లీ రేసులోకి తీసుకురావడం కోసమే సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చించుకుంటున్నారు.

నిన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీజేపీ ఇప్పుడు వారి పధకాలను కొనసాగిస్తామని చెప్పడం వెనుక ఆ పార్టీలోని నేతలు ఇదేం మతలబు అని ప్రశ్నిస్తున్నారు. అదను చూసి అధికార బీఆర్ఎస్ ను గట్టి దెబ్బ కొట్టే విధంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మరికొందరు కమలదలనేతలు అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని పక్కకు నెట్టి, కాంగ్రెస్ ను కారు పార్టీ నేతలు టార్గెట్ చేయడంతో రాజకీయాలలో ఒక్కసారిగా విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news