జగన్ వ్యూహంలో చిక్కుకున్న మాజీ మంత్రి దేవినేని..అరెస్ట్ తప్పదా ?

-

అచ్చెన్నాయుడు..కొల్లు రవీంద్ర తర్వాత టార్గెట్‌లో ఉన్న మాజీ మంత్రి ఎవరా అని ఇన్నాళ్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరిగింది. దానికి ఇప్పుడు దేవినేని ఉమా రూపంలో సమాధానం లభించింది. సీఐడిఉ అధికారులు నేరుగా ఆయన ఇంటికెళ్లి తలుపు తట్టడంతో అందరి ఫోకస్‌ ఈ మాజీ మంత్రిపై పడింది. మంత్రిగా, టీడీపీ నేతగా అప్పట్లో వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు దేవినేని. ఆ పార్టీకి టార్గెట్‌ అయ్యారు. దానికితోడు ఎన్నికల్లో ఓటమి..వైసీపీ అధికారంలోకి రావడంతో మాజీ మంత్రిని చక్రబంధంలో ఇరికించారు సీఎం జగన్.

 

దేవినేని ఉమా మహేశ్వరరావు కిందటి ఎన్నికల్లో వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్‌ చేతిలో ఓడిపోయారు. ఎన్నాళ్టి నుంచో రివెంజ్‌ కోసం ఎదురు చూస్తోన్న వసంత కుటుంబం 2019లో పైచెయ్యి సాధించింది. మంత్రిగా రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగినా.. సొంత నియోజకవర్గం మైలవరంలో మాత్రం బోల్తా కొట్టారని టీడీపీలోనే కామెంట్స్‌ వినిపించాయి. రాజకీయంగానూ ఎదురు దెబ్బలే. పంచాయితీ ఎన్నికల్లో మైలవరంలో టీడీపీ ఆరుచోట్లే గెలిచింది. ఎన్నికలంటే ముందే ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఈ వరస ఘటనల నుంచి తేరుకోక ముందే ఇప్పుడు సీఐడీ రూపంలో మరో ప్రమాదం ఆయన్ని పలకరించింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు వివిధ కేసుల్లో జైలుకు వెళ్లారు. నాటకీయ పరిణామాల మధ్య వారిని కటకటాల వెనక్కి పంపించారు. బెయిల్‌ లభించక చాలా రోజులు జైలులోనే ఉండిపోయారు. అంశాల వారీగా ఒక్కో మాజీ మంత్రిని గురిపెడుతుండటంతో అచ్చెన్న, కొల్లు తర్వాత ఎవరన్నది ఇన్నాళ్లు చర్చ జరిగింది. నెక్ట్స్‌ దేవినేని ఉమా మహేశ్వరరావే అని అంతా అనుకున్నా.. ఎందుకో గ్యాప్‌ వచ్చింది. రామతీర్థం ఘటనలో మరో మాజీ మంత్రి కళా వెంకట్రావును అదుపులోకి తీసుకుని విడిపెట్టేశారు. అంతా సర్దుకుందని భావించిన తరుణంలో ఉమా ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం జగన్‌పై విమర్శలు చేశారు దేవినేని ఉమా. తిరుపతిపై జగన్‌ అభిప్రాయం ఇది అని ఒక వీడియోను ప్రెస్‌మీట్‌లో చూపించారు మాజీ మంత్రి. అయితే అది మార్ఫింగ్‌ వీడియో అని ఫిర్యాదు రావడంతో సీఐడీ ఏడు సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేసింది. వీటిల్లో కొన్ని నాన్‌బెయిల్‌బుల్‌ సెక్షన్లు కూడా ఉన్నాయి. విచారణకు సహకరించాల్సిందిగా ఈ కేసులో రెండుసార్లు ఉమాకు నోటీసులు ఇచ్చింది సీఐడీ. ఉమా నుంచి స్పందన లేకపోవడంతో సీఐడీ అధికారులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ప్రస్తుతం సిఐడీ అధికారులు ఉమాతో సన్నిహితంగా ఉండేవారి కదలికలపై ఫోకస్‌ పెట్టారట. అయితే సిఐడీ పెట్టిన కేసు కొట్టేయాలని కోర్టులో పిటిషన్‌ వేశారు మాజీ మంత్రి. జరుగుతున్న పరిణామాలను చూసిన వారంతా ఉమా దొరికితే అరెస్ట్‌ చేయడం .. జైళ్లో పెట్టడం ఖాయమనే చర్చ జోరందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news