వరుస ఎన్నికలు, ఉప ఎన్నికలతో తెలంగాణ పార్టీలు, నాయకులు, ఓటర్లు సంవత్సర కాలంగా ఒకటే బిజీ. గ్రేటర్ ఎన్నికలు అంత మజా రాలేదు కానీ దుబ్బాక, నాగార్జునసాగర్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగగా, ఇప్పుడు వీటన్నింటినీ తలదన్నేలా హుజూరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు కానీ వరాల కుంభ వృష్టి కురుస్తుంది. అధికార పార్టీ ఏకంగా వేల కోట్లు ఈ ఎన్నికల కోసం వెచ్చిస్తుంది (దళిత బంధు కలుపుకొని).
ఏదైనా రాజకీయాలు చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )ని మించినవారు లేరనే చెప్పొచ్చు. పరిస్తితులకు అనుగుణంగా రాజకీయాలు నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో కూడా సీఎం కేసీఆర్ వ్యూహాలు అలాగే ఉన్నాయని చెప్పొచ్చు. అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ని ఓడించాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందుకే అనేక విధాలుగా అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతున్నారు.
ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో కీలకంగా ఉన్న దళిత ఓటర్లని ఆకర్షించడమే భాగంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట ఈ పథకాన్ని హుజూరాబాద్‌లోనే అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. 20942 కుటుంబాలకు గాను 2వేల కోట్ల నజరానా ప్రకటించారు. అయితే ఉపఎన్నికలో గెలవడానికే కేసీఆర్ ఇలా రాజకీయం చేస్తున్నారని, ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి సమాధానంగా కేసీఆర్ కూడా… అవును తాము రాజకీయమే చేస్తున్నామని, అందులో ఎలాంటి అనుమానం అక్కరలేదని గట్టిగా చెప్పేశారు. దీంతో ప్రతిపక్షాలకు ఇంకా ఎలాంటి విమర్శలు చేయాలో అర్ధం కావడం లేదు. ఇదే సమయంలో రాజకీయంగా లబ్ది పొందడానికే పథకం అమలు చేస్తున్నామని చెప్పడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ప్రభుత్వ సొమ్ముని అలా ఎన్నికల్లో లబ్ది పొందటానికి ఎలా ఉపయోగిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ భూములను కాపాడలేమంటూ వేలం వేస్తే వచ్చిన డబ్బులు.. కోకాపేట్లో 49 ఎకరాలు వేలం వేస్తే వచ్చిన డబ్బుని స్వ ప్రయోజనాలకోసం, తమ పార్టీ గెలుపుకోసం వాడుకోవడం ఏంటంటూ ప్రతి పక్షాలు నెత్తినోరు కొట్టుకుంటుంటే.. ” పబ్లిక్ మాత్రం తమ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలొస్తే బాగుండని, సారు ఏదో ఒకటి చేసి ఉప ఎన్నికలొస్తే మాకూ మంచి మంచి పథకాలు వస్తాయి కదా అంటూ సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు.
మీ కోరిక బాగానే ఉంది కానీ, ఉప ఎన్నిక ఎప్పుడొస్తదో తెలుసా..? అంటే ఎమ్మెల్యే రాజీనామా చేయడమో, లేక చనిపోతే ఉపఎన్నికలు వస్తాయని అంటున్నారు. కానీ మొదటి అప్షన్ తోనే ఉప ఎన్నిక కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
వేల కోట్ల రూపాయలు దళిత బంధు పేర ఒకే సామాజిక వర్గానికి ఇస్తుండటం వల్ల దళితబంధు పథకంపై ఇతర వర్గాల ప్రజల నుంచి కూడా వ్యతిరేకిత వచ్చే ఛాన్స్ ఉందని, అంత పెద్ద ఎమౌంట్ పథకానికి ఇస్తే, వేరే వర్గాల ప్రజల్లో కూడా అసంతృప్తి రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే కేసీఆర్ అమలు చేసే దళితబంధుపై పెద్ద రచ్చే జరుగుతుంది.
హుజూర్ నగర్ ఎన్నిక ఎంత మాత్రమూ ప్రాథాన్యత లేని ఉప ఎన్నిక.. ఎందుకంటే ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా ప్రభుత్వనికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ధిక్కార స్వరం మరోసారి వినిపించకూడదని, ఇజ్జత్‌కే సవాల్‌గా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.