డైలాగ్ ఆఫ్ ద డే : ఆయ‌న పీకే ! పీఎం కాదు ! మ‌రీ..అంత బిల్డ‌ప్ ఇవ్వొద్దు  

కొన్ని సార్లు అతి చేస్తే గ‌తి చెడుతుంది. కొన్ని సార్లు అతి బాగానే క‌లిసి వ‌స్తుంది. మీడియాలో చేసే అతి గురించి వాళ్ల అతి వాగుడు గురించి అస్స‌లు మాట్లాడుకోవ‌డం కానీ చ‌ర్చ‌కు తీసుకు రావ‌డం కానీ చేయ‌కూడ‌దు. అదేవిధంగా అదిగో పీకే ఇదిగో పీకే అంటూ హ‌డావుడి కూడా చేయ‌న‌క్క‌ర్లేదు. ఎవ‌రి ప‌ద్ధ‌తిలో వారు రాజ‌కీయాలు చేసుకుంటూ పార్టీలు న‌డుపుకుంటూ ఉంటే చాలు. అందుకు ప్ర‌శాంత్ కిశోర్ వ‌స్తేనే ఫ‌లితాలు మారిపోతాయి అని అనుకోవ‌డమే అధినాయ‌కత్వాలు త‌మ మీద తాము న‌మ్మ‌కాల‌ను కోల్పోతున్నారు అనేందుకు ఓ పెద్ద తార్కాణం. పైగా రెండు తెలుగు రాష్ట్రాలో ఓ పీఎంకు ఇచ్చినంత బిల్డ‌ప్ ఆయ‌న‌కు ఇస్తున్నారు. ఎందుకని ? ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌శాంత్ కిశోర్ ఎవ‌రో ? ఇంకా చెప్పాలంటే ఆ టైం వ‌స్తే ఎవ‌రెవ‌రో ఎవ‌రికి ఎవ‌రో అన్న మాటే త‌ప్ప‌క వినిపిస్తుంది కూడా ! కానీ మ‌న పాల‌క పార్టీల‌కు ఆయ‌నిప్పుడొక దేవుడు. గుజ‌రాత్ లో కొంత కాలం ఇలానే బిల్డ‌ప్ ఇచ్చాక ఇప్పుడు బీజేపీ ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానుకుంది. ఇక కాంగ్రెస్ వంతొచ్చింది. అలానే కేసీఆర్ వంతు కూడా !  క‌నుక ఆయ‌న ఇలాకాలో ఓ క్యాబినెట్ మినిస్ట‌ర్ అన్న రేంజ్ లో హ‌వా సాగిస్తున్నారాయ‌న‌.

తెలంగాణ అయినా ఆంధ్రా అయినా , బీహార్ అయినా బెంగాల్ అయినా ఆయ‌న మాట వేదం అయి ఉంటుంది. లేదా వేద వాక్కు అయి ఉంటుంది. అంత మాత్రం చేత ఆయనేం సీఎం కాదు పీఎం అంత క‌న్నా కాదు. ఓ మామూలు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ . ఆయ‌న గురించి కేటీఆర్ కూడా  ఓ సంద‌ర్భంలో  కేసీఆర్ ను మించిన తోపా ? అని కూడా స్పందించిన దాఖ‌లాలు ఉన్నాయి. వాస్త‌వానికి కేసీఆర్ ను మించిన వ్యూహక‌ర్త తెలంగాణ అస్స‌లు ఉన్నారా? ఆ మాట‌కు వ‌స్తే జ‌గ‌న్ కానీ కేసీఆర్ కానీ ఇలాంటి వారిపై ఆధార ప‌డాల్సిన ప‌నే లేదు. అలాంటిది ఆయ‌న‌కు రాచ‌మ‌ర్యాదలు చేస్తూ, భారీ సెక్యూరిటీ మ‌ధ్య తీసుకువ‌స్తూ ఎందుకీ హ‌డావుడి. ఏం చేశార‌ని ఆయ‌న ఇప్ప‌టిదాకా ? ఓ ఎన్నిక‌ల స‌ల‌హాదార‌కు క్యాబినెట్ మినిస్ట‌ర్ రేంజ్ లో హారతులు ప‌ట్ట‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యం ఏంటి ?

రాజ‌కీయాల్లో వ‌చ్చే మార్పులకు అనుగుణంగా మీడియా ప్రాధాన్యాలూ మారిపోతాయి. నిన్న ఉన్న విధంగా ఇవాళ ఉండ‌దు. ఇష్యూ మారిపోయిన ప్ర‌తిసారీ కొత్త వ్య‌క్తులు వ‌చ్చి తెర‌పై నాలుగు ర‌కాల న‌వ్వులో లేదా 40 ర‌కాల ఏడుపులో చూపించి వెళ్తారు. ఆ విధంగా వెళ్తేనే వారికి ఆనందం లేదా వారికి ప్రాచూర్యం కూడా ! ప్ర‌చార ఆర్భాటం లేకుండా ఉంటే ప‌నులు జ‌ర‌గ‌వు. జ‌నం ప‌ట్టించుకోరు. జ‌నం ప‌ట్టించుకున్నా ప‌ట్టించుకోక‌పోయినా మీడియా ప‌ట్టించుకోదు. క‌నుక వీలున్నంత వ‌ర‌కూ అంద‌రినీ అంతా ప‌ట్టించుకుంటూ వెళ్లాలి. అంద‌రినీ అంతా క‌లుపుకుని పోవాలి. అంద‌రితో అంద‌రూ విభేదాలు పెట్టుకోకుండా ఉండాలి. ఇవే ఇప్పుడు ప్రాధాన్యాంశాలు. ఇవి కాకుండా మ‌రేవీ లేవు. రావు కూడా !  ఆ విధంగా మీడియాలో హైలెట్ గా నిలిచే వ్య‌క్తులు కొంత కాలం త‌రువాత ఏమౌతున్నారు ? ఆ విధంగా మీడియా క‌నిపించి మెరిపించి మైమ‌రిపించిన వారంతా త‌రువాత దిగులు ముఖాల‌తో ఎందుక‌ని ఇళ్ల‌కే పరిమితం అవుతున్నారు. ఎలా చూసుకున్నా అతి కార‌ణంగా మంచి ఫ‌లితాలు రానే రావు.

ఇక ఇదే సూత్రం తాజాగా తెలంగాణ వాకిట హ‌ల్చ‌ల్ చేస్తున్న ప్ర‌శాంత్  కిశోర్ కు కూడా వ‌ర్తిస్తుంది. ఆయ‌నొస్తున్నారంటే పోలీసులు కూడా బాగానే అతి చేస్తున్నారు. ప్ర‌గ‌తి భ‌వన్ లో ఆయ‌న‌కు రాచ‌మ‌ర్యాద‌లు ద‌క్కుతున్నాయి. ఎన్న‌డూ లేని విధంగా ఆయ‌న‌కు పోలీసులు సాద‌ర స్వాగ‌తాలు ప‌లుకుతున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే ఆయ‌నేమ‌యినా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనా అన్న అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చక్క‌దిద్దుకోవాలి అన్న సూత్రాన్ని బాగానే పాటిస్తూ ప‌ద్ధ‌తిగా యాన ముందుకు వెళ్తున్నారు. అనుకున్న‌ది సాధించే క్ర‌మానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.