రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా కూడా అంతా సంక్షేమ జపాన్నే చేస్తుంటాయి. మనుషులకు ఇంత సాయం చేయడం గొప్ప విడ్డూరం. ప్రజలకు చెందిన డబ్బునే తిరిగి వారికి ఇవ్వడం పరమావధిగా చెప్పుకునే గొప్ప మాట. ఇవి కాకుండా ఏమయినా ఇన్నేళ్ల కాలంలో రాజకీయ నాయకులు చేస్తే లేదా చేయగలిగితే మంచిదే! అందుకు వారు ఎంతో గొప్ప పుణ్యం చేసిన వారు అయి ఉంటారని భావించాలి కూడా ! ఆ పుణ్యంలో వాటా ప్రజలకు ఉన్నా లేకపోయినా వారి సంబంధీకులు పంచుకుంటే చాలు.
ఇవాళ దళిత నేత బాబూ జగ్జీవన్ రామ్ పుట్టిన్రోజు (జయంతి అని రాయాలి). ఇవాళ ఆయన నామస్మరణలో తెలంగాణ నేతలు ఉంటారు. సంబంధిత కార్యకర్తలు కూడా ఉంటారు. తెలంగాణ వాకిట అంతటి పెద్దాయన తరువాత దళిత బంధువుగా వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా కేసీఆర్ కూడా ఉంటారు. ఉండాలి కూడా! ఈ మాట హరీశ్ రావు ఈ మాట కేటీర్ చెబుతారు. ఆ విధంగా వారి మాటలను కూడా గౌరవించాలి మనం.
ఇక దళిత బంధు పథకం ఏ విధంగా అమలు అవుతోంది అన్నది ఆరా తీయండి. ఏం కాదు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను డైవర్ట్ చేసి లబ్ధిదారుల సంఖ్య పూర్తిగా తగ్గించి వాళ్లకు ఆశ చూపుతూ పంచుతున్న డబ్బు సంబంధిత పథకం దళిత బంధు. కానీ పది లక్షల రూపాయలతో యూనిట్ కొనుగోలు లేదా సంబంధిత మొత్తం వినియోగంపై కలెక్టర్ల చొరవ బాగుండడంతో కాస్తో కూస్తో మేలు లభిస్తోంది. ఎందుకంటే ఈ పాటి లబ్ధి గతంలోనూ చేశారు.
అయితే అప్పుడు ఎక్కువ సంఖ్యలో చేరేది కానీ ఇప్పుడు తక్కువ సంఖ్యకే పరిమితం అయి ఉంటుంది.ఈ పథకం అమలులో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల మనుషులకే ఎక్కువ లబ్ధి ఉంటోందని కూడా విపక్షం అంటోంది. దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని కేసీఆర్ కోరిక గా ఉన్నా,అది కూడా సాధ్యం కాదని ఇక్కడ ఉన్నంత మతలబు ఇంకెక్కడా ఉండదని అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అంటోంది.
ఈ నేపథ్యంలో దళిత బంధు ఎవరు? కేవలం వాళ్లనొక ఓటు బ్యాంకుగా స్థిరం చేస్తున్న కేసీఆర్ దళిత బంధు అవుతారా ! లేదా కేసీఆర్ ను తిట్టి అద్దంకి దయాకర్ లాంటి లీడర్లు, రేవంత్ రెడ్డి లాంటి లీడర్లు దళిత బంధు గా స్థిరపడతారా? ఈ నేపథ్యంలో ఎవరు ఎలా ఉన్నా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నవి పార్టీలకు అతీతంగా చేర్చేవారే దళిత బంధు అని చెప్పండి ఏ నాయకుడైనా సరే ! ఆ మాట బాగుంటుంది. ఏ రాజకీయ ప్రయోజనం ఆశించకుండా దళితులకు మేలు చేస్తే సంతోషించేందుకు
అంతా సిద్ధం ఇవాళ.
ముందు ప్రస్తావించిన విధంగా ఆ మహనీయుని పుట్టిన్రోజు (జగ్జీవన్ రామ్ జయంతి నేడు (ఏప్రిల్ ఐదు)) జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని కేసీఆర్ వెల్లడించడం విశేషం. తద్వారా సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నత రీతిలో నిలిపేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజాభివృద్ధికి పాటుపడుతున్నదని సీఎం పేర్కొన్నారు.అంటే ఇకపై కూడా పెద్దాయన స్ఫూర్తితోనే తెలంగాణ వాకిట మరిన్ని పథకాలు అమలు కాగలవని కోరుకుందాం మనం అంతా!