ఏపీకి జగన్ jagan యువ ముఖ్యమంత్రి. ఆయన గెలిచి రెండేళ్ళు అయింది. ఏపీలో అభివృద్ధి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. సరే చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులే ఈనాటి అప్పులు అని జగన్ తరఫున వాదించవచ్చు. అదే సమయంలో విభజన కష్టాలు అని నిష్టూరాలు వేయవచ్చు. కేంద్ర సహకారం లేదని కూడా వాదించవచ్చు. అయితే ఇవన్నీ పక్కన పెడితే జగన్ యువకుడు. ఆయన పొలిటికల్ అజెండా కూడా చాలా స్పష్టంగా ఉంది. ఆయన మరో మూడు దశాబ్దాల పాటు ఏపీకి సీఎం గా ఉందామని అనుకుంటున్నారు. దాంతో జగన్‌దే ఇపుడు ఎక్కువ బాధ్యత అన్న మాట ఉంది.
ఆయన ఏపీని ముందుకు తీసుకెళ్ళేందుకు మార్గాలు ఆలోచించాలి. ఈ రోజుకు అప్పులు చేసి చేతులు కడుక్కుంటే సరిపోతుంది అని ఆలోచించడమే పెద్ద తప్పు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీయే గెలుస్తుంది అన్నది ఇప్పటివరకూ ఉన్న రాజకీయ అంచనాలు. అందువల్ల జగన్ ఇన్నేసి అప్పులు చేసినా రేపటి రోజున ఆయన మళ్ళీ సీఎం అయితే వాటి తాలూకా ఇబ్బందులు అన్నీ కూడా ఆయనే భరించాల్సి ఉంటుంది. మరో వైపు చూస్తే ఏపీలో సరైన విపక్షం లేదు. టీడీపీ నెమ్మదిగా తగ్గిపోతోంది. చంద్రబాబు వయసు మీరి ఉన్నారు. ఆయన పార్టీలో ఉన్న వారు కూడా సీనియర్లు.
ఆయనకు మద్దతుగా నిలిచిన మీడియా యాజమాన్యాల వయసు కూడా అంతే. అంటే రేపటి రోజుల జగన్ మళ్లీ గెలిస్తే వీరంతా ఇప్పటి మాదిరిగా గట్టిగా సౌండ్ చేసే సీన్ ఉండకపోవచ్చు. అందువల్ల వారి గురించి ఆలోచనలు మానేసి ఏపీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న దాని మీదనే జగన్ ఆలోచన చేస్తే మంచిది. జగన్ లో మంచి పారిశ్రామికవేత్త ఉన్నారు. ఆయన తన తెలివితేటలకు పదును పెట్టి ఏపీని ముందుకు తీసుకుపోవాలి.
కేంద్రం సాయం చేయకపోయినా ఏపీ తన సొంత కాళ్ళ మీద నిలబడేలా ప్రణాళికలు రూపొందించాలి. ఏపీకి ఉన్న వనరులు అన్నీ కూడా ఉపయోగించుకుంతే అది అసాధ్యమేమీ కాదు. ఆ దిశగా జగన్ ఆలోచనలు చేస్తే మాత్రం కచ్చితంగా ఆయన మంచి పాలకుడిగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమే.