చంద్ర‌బాబుకు కొత్త చిక్కులు తెస్తున్న జేపీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. అలాంటి వ్యాఖ్య‌లు పార్టీకి న‌ష్ట‌మే..

ఏపీలో టీడీపీ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌త్య‌ర్థుల‌తో పోటీ చేయ‌డ‌మేమో గానీ చంద్ర‌బాబుకు సొంత పార్టీ నేత‌ల‌తోనే స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీలో ఉన్న వారంతా కూడా క‌లిసి కట్టుగా ప‌నిచేస్తేనే పార్టీ అధికారంలోకి వ‌స్తుంది. కానీ ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌డం లేదంటే ఆధిప‌త్యం రాజ‌కీయాలు చేయ‌డంతో చంద్ర‌బాబుకు ఇంటిపోరు త‌ప్ప‌ట్లేదు. అన‌వ‌స‌రంగా చాలామంది లీడ‌ర్లు లేనిపోని మాట‌ల‌తో పార్టీపై కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని దెబ్బ తీస్తున్నారు.

ఇప్ప‌టికే చాలామంది ప్ర‌తి విష‌యానికి అల‌క బూన‌డం లేదంటే ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు చేయ‌డంతో చంద్ర‌బాబుకు వీటితోనే స‌మ‌యం గ‌డిచిపోతోంది. ఇంకా చెప్పాలంటే వైసీపీ నేత‌ల కంటూ కూడా ఆయ‌న్ను సొంత పార్టీ నేత‌లే ఎక్కువ‌గా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మ‌న్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు చంద్ర‌బాబుకు కొత్త చిక్కుల‌లు తెచ్చి పెడుతున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌లు పార్టీని కించ‌ప‌రిచేలా ఉన్నాయి.

ఆయ‌న మీడియాతో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని, ఇప్పుడు పార్టీని కార్య‌క‌ర్త‌లు, ఇటు ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేర‌ని చెప్ప‌డం పెను సంచ‌ల‌న‌మే రేపుతోంది. చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న నాయ‌క‌త్వాన్ని పార్టీ భ‌విష్య‌త్‌పై టీడీపీ కార్యకర్త‌ల‌కు పెద్ద‌గా న‌మ్మ‌కం లేద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా ఓడిపోతామంటూ చెప్పారు. ఇక చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్యర్థులు మార్చితేనే పార్టీ గెలుస్తుంద‌ని, ఈ విష‌జ్ఞంలో చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా మేల్కొని వెంట‌నే వారిని మార్చేయాలంటూ సూచిస్తున్నారు.