కన్నడ నాట కాంగ్రెస్ జెండా ఎగిరింది..మళ్ళీ హస్తం హవా నడిచింది. అటు కేంద్రం, ఇటు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి..కర్ణాటకని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. 224 సీట్లు ఉన్న కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ 113 దాటి 130 పైనే స్థానాలని గెలుచుకునే దిశగా కాంగ్రెస్ వెళుతుంది. 130 పైనే స్థానాలు కైవసం చేసుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక 2018లో కాంగ్రెస్-జేడిఎస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని సొంతం చేసుకున్న బిజేపి ఈ సారి..కేవలం 60 పైనే సీట్లని సొంతం చేసుకుంది. అటు హాంగ్ వస్తే కింగ్ అవుదామని చూసిన జేడిఎస్ 25 లోపే సీట్లకే పరిమితమైంది.
మొత్తానికి కర్ణాటకలో కాంగ్రెస్ సత్తా చాటింది. అయితే కాంగ్రెస్ విజయానికి పూర్తిగా టీం వర్క్ కారణమని కేపిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ అంటున్నారు. ప్రధానంగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నేతలు బాగా పనిచేశారని, అందరూ కలిసి టీం వర్క్ చేశామని అంటున్నారు. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారాలు కలిసొచ్చాయని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ విజయంలో డికే శివకుమార్, సిద్ధరామయ్యలతో పాటు ఇటీవలే ఏఐసిసి అధ్యక్షుడు అయిన మల్లిఖార్జున్ ఖర్గే.. పలువురు సీనియర్లు టీం వర్క్ చేశారు. ఖర్గే కన్నడ రాష్ట్రానికి చెందిన నేత కావడంతో ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేశారు. అటు సిద్ధు తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేసి..పార్టీకి కలిసొచ్చేలా చేశారు.
అయితే వీరందరిలో కాంగ్రెస్ గెలవడానికి గేమ్ ఛేంజర్ ఎవరంటే..డౌట్ లేకుండా డికే శివకుమార్ అని చెప్పవచ్చు. పిసిసి అధ్యక్షుడుగా ఉంటూ..క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తూ..బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేసి..ఆర్ధికంగా పార్టీకి పెద్ద ఊతమిచ్చారు. కింది స్థాయి నేత నుంచి పెద్ద నేత వరకు టచ్ లో ఉంటూ..అహర్నిశలు పార్టీ గెలుపు కోసం పనిచేశారు. కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించిందంతే..డికే కష్టం చాలా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన సిఎం రేసులో కూడా ఉన్నారు. అటు సిద్ధరామయ్య ఉన్నారు. మరి ఎవరికి సిఎం పదవి దక్కుతుందో చూడాలి.