నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదని కేటీఆర్ అన్నారు. అక్కడ రైతులు నామినేషన్లు వేయలేదని, రాజకీయ కార్యకర్తలే నామినేషన్లు వేసి ఓటర్లను గందరగోళానికి గురి చేశారన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తే మరో వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో టీఆర్ఎస్‌కు పరాభవం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకురాలు, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే దీనిపై అందరూ పలు రకాలుగా విశ్లేషించారు. కవిత ఓటమికి కారణం రైతులే అని చాలా మంది చెప్పారు. అయితే ఇది కరెక్ట్ కాదని, కవిత ఓటమికి కారణం రైతులు కాదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ ఇవాళ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదని అన్నారు. అక్కడ రైతులు నామినేషన్లు వేయలేదని, రాజకీయ కార్యకర్తలే నామినేషన్లు వేసి ఓటర్లను గందరగోళానికి గురి చేశారన్నారు. కాగా జగిత్యాల నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచే 93 నామినేషన్లు పడ్డాయని తెలిపారు. అలాగే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కవడం వల్లే కవిత ఓడిపోయారని కేటీఆర్ అన్నారు.
తాను, కవిత అనేక డక్కామొక్కీలు తిన్నామని, కేవలం ఒక్కసారి ఓడిపోతే తాము కుంగిపోమని కేటీఆర్ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడమే తమ లక్ష్యమని, దాన్నే ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇక అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే టీఆర్ఎస్‌కు నష్టమని కొందరు అన్నారని, కానీ దాంతో తాను ఏకీభవించనని, ఎందుకంటే ఒడిశాలో రెండు ఎన్నికలు జరిగినా అక్కడ నవీన్ పట్నాయక్ గెలిచారు కదా.. అని కేటీఆర్ అన్నారు.