బండి సంజయ్ కన్నా రేవంత్ రెడ్డి కన్నా తానే మిన్న అన్న విధంగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఉన్నారు. ఆయన ఎన్నడూ లేనిది వ్యాఖ్యలలో తీవ్రత పెంచారు. అధికారికంగా ఉన్న లెక్కలు చెప్పి కేంద్రాన్ని నిలదీయడం బాగానే ఉంది కానీ తిట్ల దండకం కూడా అచ్చం కేసీఆర్ మాదిరిగానే అందుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నిన్నటి వేళ తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లాలో ఏర్పాటుచేసిన సభలో డైలాగులు దంచికొట్టారు. స్వభావ విరుద్ధంగా కూడా కొన్ని మాటలు మాట్లాడారు. దేశ ప్రధానిని ఉద్దేశించి చాలా మాటలు చెప్పారు.
అవన్నీ కేంద్రంలో ఉన్న బీజేపీ అధి నాయకత్వం వింటుందో లేదో కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నిన్నటి వేళ బాగానే విన్నారు. విన్నారు సరే ! కేటీఆర్ బాధను అర్థం చేసుకుంటారా లేదా ఇదంతా పొలిటికల్ డ్రామా అని గుర్తిస్తారా అన్నదే ఓ పెద్ద సందేహం. రాష్ట్రంలో కాస్తో కూస్తో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కి కేటీఆర్ దూకుడు ఓ విధంగా అంతు పట్టడం లేదు. ఏ విధంగా అయినా ఆయన్ను అడ్డుకుందాం అంటే సరైన వాగ్ధాటి ఉన్న నేతలే కరవవుతున్నారు.
నిప్పురా తాకరా అని తనదైన స్టైల్ లో డైలాగులు చెప్పాడు రజనీ ! కబాలీ సినిమాకు సంబంధించి ! అదే రేంజ్ లో అదే స్పీడులో ఉన్నారు మన తెలంగాణ తారక్ (తెలంగాణ మంత్రి కేటీఆర్). ఆయన కూడా నాన్న మాదిరిగానే ఫైర్ అవుతున్నారు. నాన్న బాట లోనే నడుస్తున్నారు. ఆయన చెప్పిన విధంగానూ మరియు తనకు తోచిన విధంగానూ తన తండ్రి కేసీఆర్ స్టాండ్ ఇదేనని మరో మారు పునరుద్ఘాటిస్తున్నారు. పొలిటికల్ గేమ్ ను రక్తి కట్టించే పనికి ఆయనే మరింత కొనసాగింపు ఇస్తున్నారు.
ఆ విధంగా కేసీఆర్ మరియు కేటీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. గెట్ రెడీ టు ఫేస్ ఇట్ అన్న విధంగా ఛాలెంజ్ లు విసురుతున్నారు. కేంద్రంలో బీజేపీ పాలన బాగాలేదని చెప్పడం కన్నా ఎందుకు బాగాలేదో చెప్పే ప్రయత్నం ఒకటి విపరీతంగా చేస్తున్నారు. ఆ విధంగా పొలిటికల్ మైలేజ్ ను పెంచుకుంటున్నారు.
నిన్నటి వేళ ఆయన కొన్ని లెక్కలు చెప్పారు. వాటి ప్రకారం కేంద్రానికి తాము పన్నుల రూపంలో చెల్లిస్తున్నది మూడు లక్షల కోట్లకు పైగా అయితే కేంద్రం తిరిగి చెల్లింపుల పేరిట చేసింది లక్ష కోట్లే అని..మిగతా రెండు లక్షల కోట్లు ఏమయ్యాయి అని హనుమకొండలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రశ్నించారు. అంటే తెలంగాణ ప్రజలు దేశాన్ని ముందుకు నడిపే ప్రచోదక శక్తులుగా ఉన్నారని, అయినా కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి, ఇక్కడి ప్రజల అభ్యున్నతికి కేంద్రం చేస్తున్నది ఏమీ లేదని తేల్చేశారు. ఆ విధంగా తాము ఎంతగా కేంద్రానికి సహకారం అందిస్తున్నా, తిరిగి అదే స్థాయిలో కేంద్రం నుంచి వస్తున్న సహకారం కానీ మద్దతు కానీ పరిపూర్ణంగా లేవని ఆవేదన చెందారు.
ఇంకా ఆయనేమన్నారంటే…
తెలంగాణకు అడుగడుగునా మోసం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అనే మూడు అక్షరాల పదం లేకపోతే ఇవాళ్టి టీ పీసీసీ, టీ బీజేపీ ఎక్కడివి? ఇవాళ మొరుగుతున్న కుక్కలకు, గాడిదలకు ఆ పదవులు ఎక్కడివి? వీరిని ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోలేదు. ఎవడు రేవంత్ రెడ్డి, ఎవడు బండి సంజయ్.. వీళ్లు ఎగిరెగిరి పడుతరు. నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నరు. మోదీని బట్టేవాజ్ అని, లుచ్చాగాడు అని అనలేమా? కానీ మాకు కేసీఆర్ సంస్కారం నేర్పారు. మేం నోరు విప్పితే మా కంటే ఎవరూ బాగా మాట్లాడలేరని కేటీఆర్ తేల్చిచెప్పారు.