మునుగోడు టీఆర్ఎస్ లో చిచ్చు పెట్టిన ఉద్యమకారుల కరపత్రం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ టిఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పార్టీ ఉద్యమ సమయం నుంచి పని చేస్తున్న ఓ కార్యకర్త విడుదల చేసిన కరపత్రం నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ ఉద్యమకారులను అనగదొక్కుతున్నారా అన్న రేంజ్ లో సాగిన ఆ కరపత్రంలోని అంశాలు నియోజకవర్గంలోనే కాకుండా ఏకంగా కేటీఆర్ క్యాంప్ దాకా చేరి నానా రచ్చ చేసింది.

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఒక సామాజిక వర్గానికే కొమ్ముకాస్తూ, బడుగు, బలహీనవర్గాలను చిన్నచూపు చూస్తున్నారని, ఉద్యమకారులను అణిచివేస్తున్నారనేది కరపత్రంలోని సారాంశం. ఐతే..ఎవరూ కూసుకుంట్ల ధోరణితో పార్టీని వీడొద్దని, కేసీర్, కేటిఆర్లను నమ్ముకోవాలని అవసరమైతే వారి వద్దకు వెళ్లి కలవాలని కరపత్రంలో ఉందట. ఇక…ఈ విషయం కేటీఆర్‌ దాకా చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఐతే…కరపత్రం ఎవరు వేయించారో తేలుసుకునే పనిలో పడ్డారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరులు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు ప్రింటింగ్ ప్రెస్‌లలో తనిఖీలు చేయగా ఓ కరపత్రం లభ్యమయ్యిందట. అతణ్ణి విచారించి అసలు వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని సమాచారం.

కస్తాల గ్రామానికి చెందిన రాజు తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 నుంచి 2014 వరకు కూసుకుంట్ల వెంటే పని చేశారు. 2014లో తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి కూసుకుంట్లను మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఐతే…ఆ తరువాత నియోజకవర్గంలోని ఉద్యమకారులను పట్టించుకోలేదట. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయినట్లు కరపత్రంలో ఉందనే ప్రచారం జరుగుతోంది. 2014 తరువాత రాజు కొన్ని కారణాలతో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వెంట వెళ్లాడనేది పార్టీవర్గాలు చెబుతున్నాయ్. దీంతో రాజుపై కక్ష కట్టిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేక ఇబ్బందులకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఎస్సైతో కూడా ఇబ్బందులకు గురిచేయడంతో ఎస్సై పై హెచ్చార్సీలో పిర్యాదు చేశాడట రాజు.

కరపత్రాల పంపిణీ వెనక ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఉన్నారని, కూసుకుంట్ల భావిస్తుండగా, వీరి ఆధిపత్య పోరులో మాత్రం సామాన్యులు బలవుతున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది.