తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలనాలకు తెరతీస్తున్న విషయం తెలిసిందే. అధికార బిఆర్‌ఎస్ పార్టీలో సీటు ఖరారైన సరే..తన తనయుడు సీటు కోసమని చెప్పి బిఆర్‌ఎస్ పార్టీని వదిలేసి..కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తున్నారు. బిఆర్‌ఎస్ తరుపున మైనంపల్లికి మల్కాజిగిరి అసెంబ్లీ సీటు ఖరారైంది. కానీ ఆయన మంత్రి హరీష్ రావు టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
తన తనయుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ సీటు పరిధిలో పనిచేస్తున్నా..తన తనయుడుకు సీటు ఇవ్వకుండా ఉండటంపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. హరీష్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక అక్కడ నుంచి మైనంపల్లి బిఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. తర్వాత కార్యకర్తలు, అనుచరులతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ వచ్చిన మైనంపల్లి..అటు కాంగ్రెస్ పెద్దలతో కూడా టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలో బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ నెల 27న ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు.
అయితే బిఆర్‌ఎస్ లో సీటు దక్కిన కూడా మైనంపల్లి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇక కాంగ్రెస్ లో ఆయనకు రెండు సీట్ల హామీ వచ్చిందని తెలుస్తోంది. తనకు మల్కాజిగిరితో పాటు తన తనయుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ ఇస్తారని తెలుస్తోంది. అయితే రెండు సీట్లపై మైనంపల్లికి పట్టు ఉంది.
గతంలో టిడిపిలో మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి పనిచేశారు. 2018లో బిఆర్‌ఎస్ నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా రెండు చోట్ల మైనంపల్లికి బలం ఉంది. అటు కాంగ్రెస్‌కు కేడర్ ఉంది. కాకపోతే కాంగ్రెస్ నుంచి సీట్లు ఆశించే వారు ఉన్నారు. వారిని కాదని మైనంపల్లికి కాంగ్రెస్ రెండు సీట్లు ఇస్తుందా? ఇస్తే రెండుచోట్ల గెలిపించుకోగలరా? అనేది చూడాలి.