జ‌గ‌న్‌, చంద్ర‌బాబుల కంటే మంచిగా ప‌రిపాలిస్తా : ప‌వ‌న్‌

-

  • చంద్ర‌బాబు, మోదీ దారుణంగా మోసం చేశారు
  • లోకేష్ పంచాయితీ ఎన్నిక‌ల్లో కూడా గెల‌వ‌లేడు
  • అధికారం క‌ట్ట‌బెడితే మా అమ్మ‌ను తిట్టించారు
  • 2019లో అధికారం జ‌న‌సేన‌దే
  •  తొలి సంత‌కం సిపిఎస్ ర‌ద్దుపైనే
  • చంద్ర‌బాబు రౌడీయిజంపై, దోపిడీపై నోరెందుకు ఎత్త‌రు
  • నేను కాపు కులంలో పుట్టా, కాపులు వెనుక‌బ‌డ్డారు
  • కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం కృషి చేస్తా
  • ఇప్పుడు ఏపీలో తొల‌గించిన ఓట్ల‌లో ఎక్కువ శాతం జ‌న‌సేన‌వే
  • చంద్ర‌బాబు దొంగ దీక్ష‌లుచేస్తున్నారు
  • జ‌గ‌న్ను కావాలంటే బిజేపీలో క‌లిపేసుకోండి
  •  పంచాయితీ ఎన్నిక‌లు పెడితే జ‌న‌సేన స‌త్తా నిరూపిస్తా

pawan kalyan fires nara lokesh janasena Kavathu

అమ‌రావ‌తి(తూర్పుగోదావరి): రాష్ట్ర ప్రజలను చంద్రబాబు, మోదీ దారుణంగా మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ అవినీతిపై యువత ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగానే జనసేన కవాతు నిర్వహిస్తోందన్నారు. జనసేన నిర్వహించిన కవాతు సభలో ప్రసంగించిన పవన్.. అనుభవం కోసమే ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదని స్పష్టం చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అనుభవజ్ఞుడైన చంద్రబాబు రక్షిస్తాడనే నమ్మకంతోనే 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. కానీ, చంద్రబాబు మాత్రం జనసేన ఎప్పటికీ టీడీపీ పల్లకి మోయాలని కోరుకుంటున్నారని అన్నారు. అధికారం కోసం పవన్ మద్దతు కావాలి కానీ.. అభివ‌ృద్ధిపై సలహాలు ఇస్తే మాత్రం పట్టించుకోరని విమర్శించారు.తను చంద్రబాబుకు మద్దతిస్తే.. ఆయన మాత్రం తనను, తన తల్లిని తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లోనే తమకు బలం ఉందని, ఓట్లు చీల్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయలేక పోటీ చేయలేదన్నారు. గత ఎన్నికల్లో పవన్ దేశభక్తుడని, జనసైనికులు గొప్పవాళ్లని పొగిడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు టీడీపీ అవినీతిని ప్రశ్నించేసరికి జనసైనికులని విమర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబును ఎందుకు విమర్శిస్తున్నానో మీకు తెలియదా? అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిస్తుందని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీల పేరిట ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని, అవి జన్మభూమి కమిటీలా లేక దోపీడీ కమిటీలో అర్థం కావటం లేదని తెలుగుదేశం నేతలపై ధ్వజమెత్తారు.

నేను అధికారం రావ‌డానికి స‌హ‌క‌రిస్తే, మీరు నా త‌ల్లిని తిట్టించారు

జనసేన కవాతు సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావోద్వేగంగా ప్రసంగించారు. సీఎం పీఠం గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి లోకేశ్‌, వైసీపీ అధినేత జగన్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘తాత ముఖ్యమంత్రి కాబట్టి.. నేను ముఖ్యమంత్రినవుతా.. నాన్న సీఎం కాబట్టి నేను అవుతానంటున్నప్పుడు’’.. ఒక మునసబు మునిమనవడు.. పోస్ట్ మేన్ మనవడు… కానిస్టేబుల్ కొడుకు ఎందుకు ముఖ్యమంత్రి కాలేడని ప్రశ్నించారు. కచ్చితంగా అవుతాడని చెప్పారు. ‘‘చేయని తప్పులకు నెలలు నెలలు అనుమానాలు ఎదుర్కొన్నామని అన్నారు. తల్లిని దూషించుకున్నాం.. పౌరుషం లేదా మాకు… ఉప్పుకారం తినలేదా మేము… పౌరుషాలు మీకేనా… ఆకాశం నుంచి ఊడిపడ్డారా’’ అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. తెలుగుజాతిని గౌరవిస్తామని.. అవమానాలను భరిస్తామని.. ఎక్కువ అయితే తాట తీస్తామని అన్నారు.

తొలి సంత‌కం సిపిఎస్ ర‌ద్దుపైనే

అధికారంలోకి వస్తే తొలి సంతకం సీపీఎస్‌ రద్దుపైనే చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌పై ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు పెడితే గెలుస్తామో లేదో అన్న భయంతో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదని ఆయన విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు పెడితే జనసేన సత్తా ఏమిటో చూపిస్తామని పవన్‌ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికలు నిర్వహించకుంటే మాజీ సర్పంచ్‌లతో ఉద్యమం చేస్తామని పవన్‌ పేర్కొన్నారు.

లోకేష్ పంచాయితీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేడు

మంత్రి లోకేష్‌పై జనసేన అధినేత పవన్‌ తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని వ్యక్తిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేశారని విమర్శించారు. లోకేష్‌కు ఏం తెలుసునని మంత్రిని చేశారని ప్రశ్నించారు. ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా సాగిన జనసేన కవాతులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించిన పవన్.. విదేశీ కంపెనీలను తీసుకురావడం కాదు.. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులను పట్టించుకోండని అన్నారు. వారసత్వంతో సీఎం అవుదామని జగన్, లోకేష్ అనుకుంటున్నారని విమర్శించారు.

నేను కాపు కులంలో పుట్టా : ప‌వ‌న్

నేను కూడా కాపు కులంలోనే పుట్టాన‌ని, బ్రిటిష్ కాలంలో కాపులు బీసీలుగా ఉండేవారని ప‌వ‌న్ అన్నారు. నా బంధువులు ఎంద‌రో వెనుక‌బ‌డి ఉన్నారు. అధికారంలోకి వ‌స్తే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కోసం కృషి చేస్తా అన్నారు. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌లాంటి వాళ్లు ఒక మ‌హిళ అధికారిపై చేయి చేసుకుంటే, ఇసుక‌ను దోపిడీ చేస్తుంటే ఎందుకు మాట్లాడ‌రు అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు చంద్ర‌బాబు చేస్తున్న‌ది దొంగ దీక్ష‌లు కాదా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో తొలిగించిన ఓట‌ర్ల‌లో ఎక్కువ శాతం జ‌న‌సేన‌వేన‌ని, జ‌న‌సైనికులు వారి వారి ఓటు హ‌క్కును న‌మోదు చేసుకోవాల‌న్నారు. జ‌న‌సేన పార్టీని కొంద‌రు బిజేపీలో క‌లిపేస్తున్నార‌ని, కావాలంటే జ‌గ‌న్ను బిజేపీలో క‌లుపుకోండి అన్నారు. 2019లో అధికారం క‌చ్చితంగా జ‌న‌సేన‌దేన‌న్నారు. జ‌న‌సేన‌కు బ‌లం లేద‌ని అంటున్నార‌ని, చంద్ర‌బాబుకు ధైర్యం ఉంటే పంచాయితీ ఎన్నిక‌లు పెట్టాల‌ని, అప్పుడు త‌మ స‌త్తా ఏంటో చూపిస్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌వాల్ విసిరారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయాల‌ని చూస్తే జ‌న‌సేన చూస్తూ ఊరుకోద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news