పీకే స్ట్రాటజీ..రేవంత్ చెక్ పెట్టగలరా!

తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి..అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే…అసలు తానే పెద్ద వ్యూహకర్తని అని భావించే కేసీఆర్..పీకేని వ్యూహకర్తగా పెట్టుకున్నారు..ఇక టీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత పీకే టీం తీసుకుంది. ఇప్పటికే పీకే టీం తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి…తమ పని మొదలుపెట్టింది. అలాగే పీకే టీం డైరక్షన్ లోనే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు.

ఇదే క్రమంలో కేసీఆర్..పూర్తిగా బీజేపీనే టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ చూస్తుంటే…కేంద్రంలో మోదీ సర్కార్ ని పడగొడతానని కేసీఆర్ అంటున్నారు..ఇక ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు..పైగా జాతీయ స్థాయిలో పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారని కథనాలు వస్తున్నాయి. ఇదంతా పీకే డైరక్షన్ లోనే జరుగుతుందని చెప్పొచ్చు.

కాకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలమైన పార్టీ గా ఉంది కాంగ్రెస్…కానీ టీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తుంది…దీని వెనుక పీకే ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే కాంగ్రెస్ బలం పెరగకుండా పరోక్షంగా బీజేపీ బలం పెంచి…ఆ పార్టీని ప్రతిపక్షంగా ఉంచుకుని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పీకే చూస్తున్నారని అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని అధికారంలో ఉంచి ప్రతిపక్షాల స్ధానాన్ని బీజేపీ ఆక్రమించిందని, తెలంగాణలో నూ అదే ప్రయత్నం జరుగుతోందని, ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాత్మకంగా కేసీఆర్‌ను అధికారంలో ఉంచుతూ కాంగ్రెస్‌, ఇతర పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసి ఆ స్థానాన్ని బీజేపీకి అప్పగించే పన్నాగాలు పన్నుతున్నారని రేవంత్ అంటున్నారు.

అయితే జరుగుతున్న రాజకీయాలని బట్టి చూస్తే రేవంత్ చెప్పేది నిజమే అన్నట్లు ఉంది. కాకపోతే పీకే వ్యూహాలని తిప్పికొట్టే సత్తా రేవంత్ రెడ్డికి ఉందా? అనేది డౌట్. ఇప్పటికే టీఆర్ఎస్-బీజేపీల మధ్యే వార్ నడుస్తున్నట్లు చూపిస్తున్నారు…ఈ క్రమంలో కాంగ్రెస్ మూడోస్థానంలోకి వెళుతుంది. మరి  కాంగ్రెస్ పార్టీని రేవంత్ ఎలా పైకి లేపుతారో చూడాలి.