ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి రాజకీయంగా చివరి ఛాన్స్ దగ్గర పడిందనే చెప్పాలి. ఇప్పటికే ఆయన్ని వరుస ఓటములు పలుకరించాయి. ఇక ఈ సారి గాని ఓడితే ఆయన రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో కీలక పాత్ర పోషించిన షబ్బీర్..1989లో ఒకసారి..మళ్ళీ 2004లో ఒకసారి కామారెడ్డి నియోజకవర్గం నుంచి గెలిచారు.
అయితే కామారెడ్డి గతంలో కాంగ్రెస్ కంచుకోటగానే ఉండేది. పలుమార్లు విజయం సాధించింది. కానీ టిడిపి వచ్చిన దగ్గర నుంచి సీన్ మారింది. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి గెలిచింది..1994, 1999, 2009 ఎన్నికల్లో కూడా టిడిపి గెలిచింది. మధ్యలో 1989, 2004లోనే కాంగ్రెస్ గెలిచింది. అది కూడా షబ్బీర్ అలీ గెలిచారు. ఇక 1994లో టిడిపి నుంచి గెలిచిన గంప గోవర్ధన్..2009లో కూడా గెలిచారు. తర్వాత బిఆర్‌ఎస్ లోకి జంప్ చేసి 2012 ఉపఎన్నికలో గెలిచారు.
తెలంగాణ వచ్చాక 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇలా వరుసగా సత్తా చాటుతున్న గంప గోవర్ధన్‌కు ఈ సారి కామారెడ్డిలో అనుకూల పరిస్తితులు పెద్దగా కనిపించడం లేదు. అటు వరుసగా ఓడిపోతున్న షబ్బీర్ పై సానుభూతి ఉంది. ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు ఆయన ముందుకెళుతున్నారు. దీంతో కామారెడ్డిలో కాస్త షబ్బీర్ కు లీడ్ కనిపిస్తుందని లేటెస్ట్ సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ బిజేపి గెలిచే ఛాన్స్ లేదు గాని..కొంతమేర ఓట్లు చీల్చే ప్రమాదం ఉంది.
బిజేపి ఓట్ల చీలిక బట్టి బిఆర్‌ఎస్, కాంగ్రెస్ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కానీ ఈ సారి కామారెడ్డిలో గంప, షబ్బీర్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.