గత కొన్ని వారాలుగా.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంకేముంది.. సీఎం కేసీఆర్.. అధికార పార్టీ టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.. ఖాయం అంటూ.. కాంగ్రెస్, బీజేపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు.. జిల్లాల పర్యటనలు చేస్తున్నాయి. పాదయాత్రలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మరోవైపు.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీల్లో చేర్చుకుని.. పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే నాయకులు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తాము సిద్ధమేనని చెబుతున్నారు.
కేసీఆర్‌ను ఓడించడమే ఎజెండా అని కూడా బీజేపీ… కాంగ్రెస్..లు చెబుతున్నాయి. మరోవైపు.. అనూహ్యంగా ఇటీవల వివిధ సర్వేలు కూడా వస్తున్నాయి. మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ఈ సర్వేలు చెబుతున్నా.. మెజారిటీ తగ్గుతుందనే అంచనాలు వేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ముందస్తు ఎన్నికలు ఉంటాయా? ఉంటే.. కేసీఆర్ వ్యూహమేంటి? అసలు ఆయన నిజంగానే ముందస్తు ప్లాన్ చేస్తున్నారా? అనేది చర్చకు దారితీస్తోంది.
కేసీఆర్.. రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. పైకి ఒకటి చెప్పినా.. వెనుక చాలా వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తారు. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం విపక్షాలు ప్రజల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తట్టుకుని.. ముందుకు సాగుతాయి. సో.. ఈ విషయం కేసీఆర్‌కు తెలియని కాదు. పైగా.. 2018లో ఉన్న ఊపు ఇప్పుడు తగ్గింది. దీంతో అధికార పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి. వీటిని సరిచేసుకోకుండా.. ఆయన ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు. అయితే కేటీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదని చెప్పేశారు…కానీ కేసీఆర్ మాత్రం ముందస్తుపై బీజేపీతో సవాల్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఏమో ముందస్తుకు తాము సిద్ధమని అసెంబ్లీని రద్దు చేయాలని ప్రతి సవాల్ చేసింది..అటు కాంగ్రెస్ కూడా సై అంటే సై అంటుంది.
మరి ఇలాంటప్పుడు కేసీఆర్ ముందస్తుకు వెళ్తారా…లేక ఉత్తి సవాల్ చేశారా? అంటే కేసీఆర్ ఉట్టి సవాల్ చేశారనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నా.. ప్రయోజనం లేదు. కేంద్రంలోని బీజేపీ సహకారం లేదు. గతంలో అంటే.. ఆయన చెప్పినట్టు విన్న కేంద్రం సహకారం అందించిందనే వాదన ఉంది. కానీ, ఇప్పుడు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి. సో.. ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. మరోవైపు.. ప్రజల్లోనూ దళిత బంధు వంటి పథకాలపై ఒకింత గందరగోళం ఉంది. ప్రతిపక్షాల ప్రతి విమర్శలు.. ప్రచారం కూడా ఎక్కువగా ఉంది. ఇన్ని వ్యతిరేకతలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పట్లో ముందస్తుకు వెళ్లే అవకాశం లేదని.. అంటున్నారు పరిశీలకులు.