మస్ట్ రీడ్: రేవంత్ రెడ్డి అన్నారని కాదు కానీ… ఆలోచించండి!

సింగరేణి కాలనీలో ఆరేళ్ల గిరిజన బాలిక బలైపోయిన సంగతి తెలిసిందే. సినిమా హీరోకు జరిగిన ప్రమాధాన్ని టీఆర్పీ రూపంలో క్యాష్ చేసుకునే పనిలో మీడియా బిజీ అయిపోవడంతో.. బయట ప్రపంచానికి ఈ దారుణ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! మీడియా సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై స్పందించకపోవడం అత్యంత దారుణం! ఈ సంఘటనపై కేసీఆర్ – కేటీఆర్ లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )!

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

“డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో విశ్వనగరం జోగుతోంది.. పాలన ఫాంహౌస్ లో సేదతీరుతోంది.. ఫలితం… సైదాబాద్ లో ఆరేళ్ల గిరిజన పసి ప్రాణం బలైపోయింది. కేసీఆర్ నీకేమీ అనిపించడం లేదా? న్యాయం కోసం బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా?” అంటూ మొదలైంది రేవంత్ ప్రశ్నల వర్షం! ఆ బాదిత కుటుంబాన్ని సందర్శించిన అనంతరం రేవంత్ ప్రశ్నలు – విమర్శలు – ప్రజలు ఆలోచించాల్సిన అంశాల గురించి సవివరంగా ఇప్పుడు చూద్దాం!

బానిసత్వంలో ప్రజలు – ఆదాయ మార్గాల్లో కేసీఆర్:

తెలంగాణలో భారీగా పెరుగుతున్న మద్యం అమ్మకాలు, గంజాయి అమ్మకాలపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడకముందు మద్యం ద్వారా వచ్చిన ఆదాయం 10,883 కోట్లు ఉండగా.. కేసీఆర్ పాలన పుణ్యామాని గడిచిన ఏడేళ్లలో 36,000 కోట్లకు పెరిగిందని.. బడులు తెరవకపోయినా, గుడులు తెరవకపోయినా.. సందుసందునా బెల్ట్ షాపులు తెరిచిన ఘనత కేసీఆర్ సర్కార్ దని రేవంత్ ఫైరయ్యారు. ఫలితంగా… మద్యం, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలద్వారా ఈ ప్రాంత ప్రజలను భానిసలుగా మార్చి మహిళలపై దాడులకు, అత్యాచారాలకు కారణాలను సృష్టిస్తున్నారని కేసీఆర్ సర్కార్ పై రేవంత్ విమర్శలు కురిపించారు.

రేవంత్ అన్నారని కాకపోయినా… తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది. భావి తెలంగాణ పౌరులు మద్యం బానిసలుగా మారుతున్న తరుణం ఇది. ఈ సమయంలో ప్రజలు మేల్కోకపోతే జరిగే పరిణామాలు ఊహకు అందనివన్న విషయం ప్రతి తెలంగాణ బిడ్డా గ్రహించాలి! అలవాటుకీ – బానిసత్వానికీ ఉన్న తేడాను గుర్తించి నడుచుకోవాలి!

నాడు దిశా ప్రాణం – నేడు పసిప్రాణం – మత్తు ఫలితం:

గతంలో దిశా హత్య తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ అత్యాచారం – హత్య కూడా మద్యం మత్తులో ఉన్న యువకుల పనే అని.. నేడు సింగరేణి కాలనీలో జరిగిన పసికందు రేప్ అండ్ మర్డర్ కూడా గంజాయి మత్తులోనే జరిగిందని రేవంత్ తెలిపారు.

రేవంత్ అన్నారని కాకపోయినా… మద్యం, గంజాయిలను ఆదాయమార్గాలుగా ఎంచుకోవడంలో కేసీఆర్ సర్కార్ సక్సెస్ అయ్యిందే తప్ప, ఈ మత్తు వల్ల జరుగుతున్న దుర్మార్గాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతుందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీది వీదినా వెలిసిన కళ్లు దుకాణాలు, వాటి మాటున జరుగుతున్న గంజాయి దందాలపై ప్రజలే స్వచ్చందంగా దృష్టి సారించాలి!

ఇది అడవా – కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణా?:

“సింగరేణి కాలనీలో జరిగిన దారుణాన్ని చూస్తుంటే… మనం మనుషులు జీవించలేని అడవిలో ఉన్నామా.. అడవి మృగాల మధ్యన ఉన్నామా.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని.. విశ్వనగరం అని చెప్పిన కేసీఆర్, విషసంస్కృతికి, వికృతచేష్టలకు తెలంగాణను అడ్డాగా తయారుచేశారని” రేవంత్ దుయ్యబట్టారు.

రేవంత్ అన్నారని కాకపోయినా… పోరాటాలు – బలిదానాలు పునాదులగా నిర్మించబడిన తెలంగాణలో ఇలాంటి సంఘటనలు జరగడంపై ప్రజలు కూడా ఆలోచించాలి. విషసంస్కృతికి, వికృతచేష్టలకు కారణం అవుతున్న గంజాయి – డ్రగ్స్ వాడకాలపై ప్రభుత్వాలు కళ్లు తెరిచేలా పోరాడాలి. పోరాడి పోరాడి రాష్ట్రాన్నే తెచ్చుకున్న దమ్మున్న తెలంగాణ ప్రజలకు… ఈ విషసంస్కృతిని అరెకట్టేలా పోరాడటం పెద్ద లెక్క కాదు కదా!

బాధిత కుటుంబాన్ని పరామర్శించలేని దౌర్భాగ్యం!:

తక్షణమే ఈ బాలిక కుటుంబాన్ని కేసీఆర్, కేటీఆర్, హోంమంత్రి మహ్మద్ అలీలు పరామర్శించాలని రేవంత్ సూచించారు. “మీ ముగ్గురికి నిజంగా మానవత్వం ఉంటే.. ఈ బాదిత కుటుంబాన్ని తక్షణమే పరామర్శించాలి” అని రేవంత్ డిమాండ్ చేశారు.

రేవంత్ అన్నారని కాకపోయినా… గంజాయి మత్తులో ఉన్న మూర్ఖుడి వికృత చేష్టలకు బలైపోయిన పసికందు కుటుంబాన్ని పరామర్శించడాని కూడా ప్రభుత్వానికి వీలుదొరకలేదా? అవసరం అనిపించలేదా?
సినిమా హీరోకు ప్రమాధం జరిగితే.. మంత్రి తలసానిని హుటాహుటున పంపడంపై ఉన్న శ్రద్ధ… సాధారణ గిరిజన కుటుంబం విషయంలో ఎందుకు లేదు?

“బడుగు బలహీనవర్గాల అడ్డా – తెలంగాణ గడ్డ”లో మళ్లీ అంటరానితనం అడ్డొచ్చిందా? ప్రభుత్వంపై ప్రతీ తెలంగాణ బిడ్డా వేయాల్సిన ప్రశ్నలివి?

కామన్ సెన్స్ లేని కమిషనర్:

ఇంతదారుణమైన సంఘటన జరిగినా కూడా… ఈ సంఘటన జరిగిన స్థలాన్ని సందర్శించడానికి పోలీస్ కమీషనర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కమీషనర్ కి కామన్ సెన్స్ లేదని దుయ్యబట్టారు! కమీషనర్ తో ఫోన్ లో మాట్లాడితే.. “చూద్దాం, చేద్దాం” అంటున్నాడు తప్ప.. నిందితుడికి సంబంధించి తీసుకునే విషయాలు చెప్పడం లేదంటూ ఫైరయ్యారు.

రేవంత్ అన్నారని కాకపోయినా… ఈ విషయంలో పోలీసుల వైఖరి నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదా! ప్రభుత్వంలోని పెద్దల సేవలపైనే పూర్తి శ్రద్ధ పెడుతున్నట్లుగా భావించాల్సి వస్తుంది కదా! సంఘటనా స్థాలాన్ని సందర్శించడం, కనీస బాధ్యత కదా! అని ప్రజలు గుర్తించాలి. అధికారుల అలసత్వానికి సర్కార్ సూచనలు కూడా కారణమేమో అని ఆలోచించాలి!

కేసీఆర్ – కేటీఆర్ లు బ్రాండ్ అంబాసిడర్లు:

ఇక హైదరాబాద్ కేంద్రంగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న డ్రగ్ వ్యవహారంపై కూడా రేవంత్ స్పందించారు. “డ్రగ్స్ కు కేటీఆర్ – తాగుబోతులకు కేసీఆర్.. బ్రాండ్ అంబాసిడర్లు” అని తాను అనడం లేదు.. స్థానిక గిరిజన యువకులు తనతో అన్నారు అని రేవంత్ చెప్పుకొచ్చారు!

రేవంత్ అన్నారని కాకపోయినా… రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్, గంజా, మద్యం అమ్మకాలు, జరుగుతున్న పరిణామాలు, వికృతంగా మారుతున్న యువకుల మెదళ్లు… ఈ విషయాలపైనా, అందుకు కార‌ణ‌మ‌వుతున్న‌ ప‌రిస్థితుల‌పైన
పాలకులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది!

-CH Raja