- సీనియర్లను పక్కనబెట్టే యోచనలో చంద్రబాబు
- ప్రజలకు, పార్టీకి భారంగా మారినవారికి పార్టీ పదవులతో సరి
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలపై తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు దృష్టిసారించారు. పార్టీని అన్నివిధాలా బలోపేతంచేసే దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఏ ఎన్నిక వచ్చినా గెలుపు తెలుగుదేశానిదే కావాలని చంద్రబాబు బుధవారం నాటి టెలికాన్ఫరెన్స్‌లో స్పష్టంచేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులు, ఇతర నాయకులతో చంద్రబాబునాయుడు మాట్లాడారు. ప్రజలకు, పార్టీకి భారంగా మారిన సీనియర్లను పార్టీ పదవులకు పరిమితం చేసి యువకులకు, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి టికెట్లను కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలిచ్చారు.
ఏపీలో ప్రస్తుతం 64లక్షలు గా ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోటికి చేరుకోవాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈనెల 31 నుంచి అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలని దిశానిర్దేశంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే అనుకున్న అభివృద్ధి సాధించగలమన్న చంద్రబాబు.. పార్టీలో ప్రతిఒక్కరూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని, గెలిచే అభ్యర్ధులకే టికెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమంపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. బూత్ కన్వీనర్ల నియామకం వెంటనే పూర్తి చేయాలని, శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు స్పష్టంచేశారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఓటర్ల నమోదు ముమ్మరంగా సాగాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.