సాయిరెడ్డికి జగన్ హ్యాండ్ ఇస్తారా?

ఏమైందో తెలియదు గాని ఈ మధ్య వైసీపీలో విజయసాయి రెడ్డి హవా కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. అసలు జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్న విజయసాయికి ఇప్పుడు వైసీపీలో ప్రాధాన్యత తగ్గిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంతకాలం ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఉన్న విజయసాయిని జగన్ దూరం పెట్టారనే ప్రచారం పెరుగుతుంది. టీడీపీ శ్రేణులు అదే పనిలో ఉన్నాయి కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి హవా పెరగడంతో విజయసాయిని సైడ్ చేసేశారని ప్రచారం చేస్తున్నారు.

ఇక ఇదే ప్రచారం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా చేస్తూ వస్తున్నారు. పైగా విజయసాయికి పదవి కూడా ఇవ్వడం కష్టమని మాట్లాడేస్తున్నారు. రెండు నెలల్లో ఏపీలో నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. ఇందులో విజయసాయి రెడ్డి పదవీకాలం కూడా పూర్తి కానుంది. అయితే ఆ నాలుగు పదవులు వైసీపీకే దక్కనున్నాయి.

అయితే విజయసాయికి మళ్ళీ రాజ్యసభ పదవి దక్కడం ఖాయం. కానీ ఆయనకు పదవి ఇవ్వడానికి జగన్ సిద్ధంగా లేరని రఘురామ చెబుతున్నారు. ఇప్పటికే విజయసాయి పదవిని వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయారని మాట్లాడుతున్నారు. ఇక పదవి రాదనే తెలిసే విజయసాయి ట్విట్టర్‌లో తనపై విమర్శలు చేస్తున్నారని రఘురామ చెబుతున్నారు. అయితే గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న విజయసాయి ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అయ్యారు.

ట్విట్టర్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాజుగారిపై విరుచుకుపడుతున్నారు. అటు రాజు గారు విజయసాయికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తనని తిడితే కనీసం పదవి వస్తుందని విజయసాయి చూస్తున్నారని రాజు గారు మాట్లాడుతున్నారు. అయితే వైసీపీలో కీలకంగా ఉన్న విజయసాయికి జగన్ హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగే పని కాదు. మరి చూడాలి విజయసాయికి మళ్ళీ రాజ్యసభ పదవి దక్కుతుందో లేదో?