కేసీఆర్ రాక‌తో హుజూరాబాద్‌లో ప్ర‌చార హోరు మార‌నుందా.. ఈట‌ల‌కు క‌ష్ట‌మేనా

తెలంగాణ రాజ‌కీయాల‌ను ఇప్పుడు శాసిస్తుంది మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నిక‌లు వ‌చ్చిన త‌ర్వాతే అన్ని పార్టీల్లోనూ స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఎన్నిక‌ల‌ను కేసీఆర్ అంద‌రికంటే ఎక్కువ‌గా సీరియ‌స్ గా తీసుకుని మ‌రి ముందుకెళ్తున్నారు. ఎంత‌లా అంటే ఏకంగా ఓ ఉప ఎన్నిక కోసం ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాన్ని తీసుకొచ్చేంత‌లా ఆయ‌న దాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు అంద‌రికీ విదిత‌మే. కాగా ఈ ప‌థ‌కాన్ని ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో లాంచ్ చేయబోతున్నారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఇక ఈ ప‌థకాన్ని ప్రాంభించేందుకు కూడా దళిత ప్రజా ప్రతినిధుల సమక్షంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటనతో హుజురాబాద్ రాజ‌కీయాల్లో మార్పులు వ‌చ్చే విధంగా క‌నిపిస్తోంది. కేసీఆర్ నియోజ‌క‌వర్గ అభివృద్ధికి అన్ని ర‌కాల హామీలు ఇవ్వ‌డానికి రెడీ అవుతున్న త‌రుణంలో టీఆర్ఎస్ విక్టరీ డిక్లేర్ అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక ఇప్ప‌టికే టీఆర్ఎస్ త‌ర‌ఫున విద్యార్థి నేత అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలో దించిన కేసీఆర్ ఎలాంటి విమ‌ర్శ‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక ఎలాగైనా గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించేందుకు పూర్తి బాధ్య‌త‌ల‌ను మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ప్రజా ఆశీర్వాద యాత్ర పేరిట తీసుకుని అన్ని మండ‌లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇక కేసీఆర్ రాక‌తో టీఆర్ఎస్ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌నే భావ‌న క‌లుగుతోంది. అదే జ‌రిగితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాభవం పూర్తిగా తగ్గిపోతుందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. చూడాలి మ‌రి ఎలా ఉంటుందో.