భారత రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. గురువారం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. జూలై 18న ఎన్నికలు నిర్వహించి..21న ఫలితాలు ప్రకటించనున్నారు. జూలై 24తో ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ లోపే ఎన్నికలు నిర్వహించనున్నారు. జూలై25న కొత్త రాష్ట్రపతి పదవీ బాధ్యతలు తీసుకోన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థులపై చర్చ జరుగుతోంది. ఎన్డీయే తరుపున ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతారు.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు పోటీలో ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎన్డీయే తరుపున ఓ వ్యక్తి పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ను పోటీలో ఉంచుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ గవర్నర్ గా ఆరీఫ్ మహ్మద్ ఖాన్ పదవీలో ఉన్నారు. ముస్లిం కావడంతో పాటు నిజమైన సెక్యులర్ గా ఉండటం కూడా ఆరీఫ్ కు కలిసి వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ట్విట్లర్ లో ప్రస్తుతం ఆరీఫ్ మహ్మద్ పై చర్చ జరుగుతోంది. నెటిజెన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఈయనలో పాాటు ఎన్డీయే నుంచి మరికొంత మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ద్రౌపతి ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు మీరా కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.