తెలంగాణలో రాజకీయాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం జరుగుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆ ఎన్నికలపై దృష్టి పెట్టకుండా.. వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతోందని.. ఇది ఆ నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. జ్వరం, కరోనా లక్షణాలతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీ నిధులిచ్చి ఓట్లు అడగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మునుగోడు నియోజకవర్గానికి నిధులిచ్చి ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను, పోడు భూముల సమస్యలతోపాటు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని.. ఇందుకోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ కూడా పదే పదే ఒకటే చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఓట్లు అడిగే హక్కే లేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వ తప్పుడు విధానాలపై మునుగోడులో చర్చ జరగాల్సి ఉందన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకూ దూరంగా ఉండాలని, ప్రజా సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, ధరల పెరుగుదలతో పేదలపై పడుతున్న భారం మీద చర్చ జరగాల్సి ఉందన్నారురేవంత్ రెడ్డి.