యాత్రలతో దూకుడు పెంచిన రేవంత్

-

వరుస రైతు భరోసా యాత్రలతో దూకుడు పెంచారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి.ఆర్మూరు..అచ్చంపేట లో సాగు చట్టాలను నిరసిస్తూ కేంద్ర వైఖరిని ఎండగడుతున్నారు. అచ్చంపేట రాజీవ్‌ రైతు భరోసా సభలో పాల్గొన్న రేవంత్‌ అనూహ్యంగా అక్కడి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేయడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాల్లో వరుస పర్యటనలతో కాంగ్రెస్ కేడర్ లో కొత్త జోష్ తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. కేంద్రం తెచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా అచ్చంపేటలో జరిగిన రాజీవ్‌ రైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు రేవంత్‌ . హైదరాబాద్‌ నుంచి భారీ ర్యాలీతో నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చం పేటకు చేరుకున్న రేవంత్‌.. సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు.. వారి తరపున ప్రభుత్వంతో కొట్లాడే శక్తిని తనకు ఇచ్చారని రేవంత్‌ అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మోడీ 15 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని విమర్శించిన ఆయన.. రైతును ముంచే నల్ల చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వంపైన రేవంత్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి మోడికి వంగి వంగి దండాలు పెట్టొచ్చారని విమర్శించారు. మోడీ , కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. రైతుల పంట కొనని కేసీఆర్‌కు సీఎం పదవి ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు తమ క్యాడర్‌ జోలికొస్తే మిత్తితో సహా చెల్లిస్తామని రేవంత్ అన్నారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని పార్టీ హైకమాండ్‌కు బహిరంగంగా చెప్పామని రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడిపించే శక్తి రేవంత్‌కే ఉందన్నారు మల్లు రవి.

సభ ముగిసిన వెంటనే రేవంత్‌రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్‌ రైతు భరోసా దీక్షను ఒక్కసారిగా పాదయాత్రగా మార్చేశారు. టీ కాంగ్రెస్ నేతలు మల్లు రవి, సీతక్క పాదయాత్ర చేయాలని ఆయనకు సూచించారు. దీంతో అచ్చం పేట నుంచి హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి వెంటనే పాదయాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంటే కాంగ్రెస్‌ శ్రేణులు అడుగులో అడుగేశారు. రేవంత్‌ పాదయాత్రలో కాంగ్రెస్‌ శ్రేణుల్లో మంచి జోష్‌ కనపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news