అమరావతి: ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు సజ్జల. సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానంలో పదవీ విరమణ చేసిన నెల బేసిక్ పే పైన ఎంత పెన్షన్ వస్తుందనేది కచ్చితంగా తెలీదని… అదే జీపీఎస్ కింద కచ్చితంగా 33 శాతం పెన్షన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోందని ప్రకటన చేశారు.
మరోవైపు.. పాత పెన్షన్ విధానంలో 50 శాతం పెన్షన్ వచ్చేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయన్నారు.
ఇప్పుడు అది రద్దయి సీపీఎస్ అమల్లోకి వచ్చింది. దీంతో సీపీఎస్ కంటే మెరుగ్గా ఉంటుందని వెల్లడించారు. చివరి నెల జీతంలో 33 శాతం పెన్షన్ వచ్చేలా ఏపీ ప్రభుత్వం జీపీఎస్‌కు రూపకల్పన చేసిందని చెప్పారు. ప్రభుత్వోద్యోగుల భద్రత దృష్ట్యా మంచి పింఛన్ పథకాన్ని రూపొందించేందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని కోరారు.
వాటిని కూడా సాధ్యమైనంత మేర పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులకు మంచి పింఛన్ పథకాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పాత పింఛను పథకం, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రెండింటినీ సమన్వయం చేస్తూ మధ్యే మార్గంగా గ్యారంటీడ్ పెన్షన్ పథకాన్ని (జీపీఎస్) అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.