రూ. 135 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేంద్రం పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టీటీడీ అనుబంధ విభాగం సభలా బీజేపీ సభ జరిగిందని.. రాష్ట్రంలో బీజేపీ లేదు.. అందుకే ప్రజల భావోద్వేగాలు ఏంటో వాళ్ళకు తెలియదని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ శక్తి ఏంటో వాళ్ళకూ తెలుసని తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్ తోనే బీజేపీ సభ జరిగిందని.. రాజకీయాల్లో చంద్రబాబు ఒక మాయల ఫకీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ చరిత్రలో మొదటి సారి ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో పని చేయటమని… చంద్రబాబు గంట కొట్టగానే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడులా వచ్చి వెళుతుంటారని చురకలు అంటించారు. మాటలు బీజేపీ నేతల నోట్లో, స్క్రిప్ట్ టీడీపీ ఆఫీసు లో తయారు అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఏజెంట్లుగా సుజనా చౌదరి, సిఎం రమేష్… టీటీడీ ఎజెండాను విజయవంతంగా నడుపుతున్నారని మండిపడ్డారు. వీళ్ళిద్దరిని చూపిస్తు బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నాం అని చంద్రబాబు తన నాయకులకు చెబుతున్నారు.. అనైతికం అనే మాట దాటి దిగజారుడు వ్యభిచారం అనే చెప్పాలన్నారు. టీడీపీ=బీజేపీ=కాంగ్రెస్=సీపీఐ=జనసేన అని.. చంద్రబాబు ఈ పార్టీలన్నింటినీ తోలుబొమ్మలాట ఆడించ గలుగుతున్నారని ఫైర్ అయ్యారు. పది తలల రావణాసురుడు చంద్రబాబు అని మండిపడ్డారు.