దేశంలో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండడంతో హాస్పిటళ్లలో చేరే వారు కూడా ఎక్కువవుతున్నారు. దీంతో అందరికీ కావల్సిన వైద్య సదుపాయాలకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్ తీవ్ర లక్షణాలతో హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న వారికి రెమ్‌డెసివర్ అధికంగా కావల్సి వస్తోంది. దీంతో ఈ ఇంజెక్షన్లను మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కేంద్రం ఈ మెడిసిన్ ధరను తగ్గించినా బ్లాక్ మార్కెట్‌లో వీటి విక్రయాల దందా ఆగడం లేదు. అయితే రెమ్‌డెసివిర్ కొరత ఉన్న నేపథ్యంలో కోవిడ్ బాధితులకు ప్రత్యామ్నాయ మందులను వాడాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
సీఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలోని బయో కెమికల్ సైన్సెస్ డివిజన్, ఇండియా అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్, పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇన్‌టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు చెందిన సైంటిస్టుల బృందం రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయ మందులను సూచించింది. ఈ మేరకు వారు 61 రకాల భిన్న యాంటీ వైరల్ డ్రగ్ కాంబినేషన్లను రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయంగా కోవిడ్‌పై ప్రయోగించారు. ఈ క్రమంలో మూడు డ్రగ్‌ల కాంబినేషన్ సత్ఫలితాలను ఇచ్చిందని వారు తెలిపారు.
లెడిపస్‌విర్, సోఫోస్‌బువిర్, డాక్లాటాస్‌విర్ అనే మూడు డ్రగ్‌ల కాంబినేషన్‌ను రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయంగా వారు సూచించారు. ఈ మూడు డ్రగ్‌లను కలిపి వాడుతూ కోవిడ్‌కు చికిత్సను అందించవచ్చని వారు పేర్కొన్నారు. కోవిడ్‌పై పనిచేయగల శక్తిని ఈ మూడు డ్రగ్ ల కాంబినేషన్ కలిగి ఉందని వారు తెలిపారు. అందువల్ల రెమ్‌డెసివిర్‌కు వీటిని ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. ఇక సైంటిస్టులు ఈ డ్రగ్‌లపై చేపట్టిన పరిశోధనలకు చెందిన వివరాలను కరెంట్ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు.