చీరాల ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీకి మద్దతుదారుగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి వర్గంలో టెన్షన్ మొదలైందట! ఏ నిముషాని కి ఏం జరుగుతుందోనని ఆయన మద్దతు దారులు చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి కారణం.. కరణం వైఖరేనని అంటున్నారు పరిశీలకులు. అంతేకాకుండా.. ప్రకాశం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణలు కూడా కరణం రాజకీయాలకు పెను శాపంగా మారనున్నాయని అంటున్నారు వాస్తవానికి టీడీపీ తరఫున గెలిచిన కరణం.. ఇటీవల తన కుమారుడు వెంకటేష్ భవితవ్యం కోసం అంటూ.. వైసీపీకి మద్దతుదారుగా మారారు.ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్‌పై కరణంపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
సీనియర్ నాయకుడు, పార్టీని బలపేతం చేస్తాడు.. అని బలరాంపై జగన్ కూడా ఎన్నో వ్యూహాలు కూడా వేసుకున్నారు. కానీ, ఆయన చిల్లర నాయకుడికి ఎక్కువ.. అన్న రేంజ్‌లో వెలగబెడుతున్న రాజకీయాలు రోజు రోజుకు కొత్త వివాదాల దిశగా మారుతున్నా యి. నిజానికి కరణం వైసీపీ గూటికి చేరక ముందు వరకు చీరాల నియోజకవర్గం రాజకీయాలు వేరేగా ఉండేవి కానీ, ఇప్పుడు ఆయన దూకుడు.. ఆధిపత్య పోరుతో రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇవి జగన్‌కు తలనొప్పులుగా మారాయి. దీంతో ఆయనను వదిలించుకోవాలనే చూస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా.. సరైన ముహూర్తం చూసుకుంటున్నారని అంటున్నారు.
ఇదిలావుంటే.. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గ్రానైట్ వ్యాపారాలపైనా దాడులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ బలహీనపడుతుండడంతో గొట్టిపాటి.. కూడా మనసు మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అంటే.. రేపో మాపో.. అద్దంకిలో గొట్టిపాటి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇది.. కరణం బలరాం కుటుంబ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశీలకులు.
ఎలా అంటే ఆయన దూకుడుతో చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌పై సానుకూలత పెరుగుతోంది. పైగా చీరాల ఆమంచికి కంచుకోట. 2014లో ఆయన అక్కడ నుంచి ఇండిపెండెంట్‌గానే గెలిచి సత్తా చాటారు. పైగా కాపు సామాజిక వర్గంలో ప్రకాశం జిల్లాలోనే కాకుండా… దక్షిణ కోస్తాలో బలమైన నేతగా ఉన్న ఆమంచికి జగన్, వైసీపీ సముచిత ప్రయార్టీ ఇచ్చే దిశగానే ఆలోచన చేస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఆమంచికే ఈ టికెట్ కేటాయిస్తారు.
ఇక కరణం ఫ్యామిలీ అద్దంకి సీటునైనా కొరుకుంటున్నారు కదా.. అంటే.. అక్కడ గొట్టిపాటి కనుక.. వైసీపీలోకి వస్తే.. అక్కడ కూడా కరణం ఆశలు కుళ్లిపోయినట్టే. గొట్టిపాటి ప్రస్తుతం జరుగుతోన్న చర్చల్లో అద్దంకిలో కరణం వేలు పెట్టకూడదన్న తొలి కండీషన్‌తోనే పార్టీ మారేందుకు ఓకే అంటున్నారట. బలరాం సీనియర్ నేత కాబట్టి ఆయనకు వైసీపీ నేతలు ప్రయార్టీ ఇస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బలరాం పోటీ నుంచి తప్పుకుంటే వెంకటేష్‌కు ఏదో నామినేటెడ్ పదవో లేదా డీసీసీబీ చైర్మన్ పదవో కట్టబెట్టేసి కరణం ఫ్యామిలీని చీరాల, అద్దంకి నుంచి తప్పించే ప్రయత్నాలే ఎక్కువుగా జరుగుతున్నట్టు భోగట్టా.. ! కాదూ కూడదని వాళ్లు పట్టుబడితే వాళ్లకు పరుచూరే చివరకు ఆప్షన్ కావొచ్చు. ఈ పరిణామాలపైనే కరణం గూటికి చెందిన నాయకులు టెన్షన్ టెన్షన్‌గా ఉండడం గమనార్హం.