రాజకీయంగా తనని ఎదుర్కోలేక ఎంపీ ఆదాల, షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి తనపై తమ అనుచరులతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆధారాలు ఉంటే విమర్శలు చేయాలని సవాల్ విసిరారు. ఇలా నిరాధార ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
తాను కూడా ఇదే పంథాలో మాట్లాడితే ఆదాల, సజ్జల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డి.. డాక్టర్ రాధా మాధవికి చెందిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. స్థలాన్ని కొనుగోలు చేసేందుకు 4 కోట్ల 70 లక్షలు నగదును శ్రీనివాసులు నాయుడుకు డాక్టర్ రాధా మాధవి ఇచ్చారని.. స్థలం కొనుగోలు నిలిచిపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీనివాసులు నాయుడుని.. రాధా మాధవి కోరిందన్నారు.
గిరిధర్ రెడ్డి ద్వారా శ్రీనివాసుల నాయుడు.. రాధా మాధవికి చెందిన డబ్బులు ఇచ్చేలా ఒప్పందం రాసుకున్నారని వివరించారు. ఈ ఒప్పందం కూడా ఎంపీ వేమిరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి చెప్పే రాసుకున్నారని తెలిపారు కోటం రెడ్డి. ప్రశాంతి రెడ్డి ని అడిగితే అసలు వివరాలు తెలుస్తాయన్నారు.