విశాఖ కేంద్రంగా కొన్ని రాజకీయ పరిణామాలు మారనున్నాయి. ముందు నుంచి ఇక్కడ ఓ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ను నిర్మించాలని, ఇందుకు సంబంధించిన పనులు చూడాలని బొత్సను అప్పట్లో ఆదేశించారు సీఎం. మున్సిపల్ శాఖ ను చూసే సమయంలో బొత్సకు ఈ బాధ్యతలు అప్పగించారు. దీంతో బొత్స రంగంలోకి దిగి కొన్ని ప్రాంతాలలో భవనాలను గుర్తించారు.
అయితే ఆయా ప్రాంతాలలో సచివాలయం ఏర్పాటు చేయాలంటే ఇండియన్ నేవీ అనుమతులు తప్పని సరి అని తెలిసి వెనక్కు తగ్గారు. బొత్స హయాంలోనే సచివాలయం అమరావతి నుంచి విశాఖకు వెళ్లిపోతుందని పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో సాయిరెడ్డి నేతృత్వంలో విశాఖ వైసీపీ పరిణామాలు అన్నీ నడిచేవి. పేరుకు మంత్రి బొత్స ఉన్నా పెత్తనం మాత్రం సాయి రెడ్డిదే ఉండేదన్న వార్తలు వచ్చేయి. దీంతో తాను మాట్లాడేందుకు అవకాశం లేదని చాలా సార్లు బొత్స మండి పడ్డారు కూడా ! ప్రయివేటు సంభాషణల్లో కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే బొత్స ఆరోపణలను ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోలేదు సరికదా ఈ విషయమై మాట్లాడేందుకు కూడా ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో చాలా రోజులు సీఎంఓకు దూరంగా ఉండిపోయారు బొత్స.
విశాఖకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఓ క్యాబినెట్ మినిస్టర్ కన్నా ఓ ఎంపీ మాటే మా… ప్రాంతంలో చెల్లుబాటు అవుతుందని ఫైర్ అయ్యారు కూడా ! సాయిరెడ్డి పై నేరుగా తిరుగుబాటు చేసేందుకు ఇష్టం లేక , శక్తి చాలక ఆగిపోయారు. మంత్రులను డమ్మీలుగా మారుస్తున్న సలహాదారుల తీరుపై కూడా బొత్స ఓ సారి మండిపడ్డారు. ఇవి కూడా వార్తల రూపంలో వచ్చేయి.
ఇక బొత్స అనుకున్న విధంగా కాకుండా అనూహ్య రీతిలో విద్యాశాఖ పనులు ఆయనకు అప్పగించారు సీఎం. దీంతో ఇది కూడా ఆయనకు చేదు పరిణామమే ! తాను అనుకున్న విధంగా మున్సిపల్ శాఖ అయితే బెటర్ అని సీఎంఓను అడిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇప్పటిదాకా ఛార్జ్ తీసుకోకుండానే ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. ఇది కాకుండా మరో చేదు అనుభవం ఏంటంటే ఎప్పటి నుంచో ఆయనకు ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా పనిచేయాలని ఉంది. సాయిరెడ్డి ని తప్పించి తనకు ఆ అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని సైతం వేడుకున్నారు బొత్స. ఒకానొక దశలో సాయిరెడ్డి పై ఆరోపణలు పెరిగిపోతున్న నేపథ్యం ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచనే చేశారు.
ఆఖరికి సాయి రెడ్డి ని తప్పించి మరో బంధువు సుబ్బారెడ్డి (టీటీడీ చైర్మన్)కి ఆ పదవి అప్పగించారు. ఇది కూడా చేదు అనుభవమే ! ఇవాళ సాయిరెడ్డి కూడా విశాఖను వదలకుండా, తన వర్గంలో ఉన్న నేతలు చేజారి పోకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. పేరుకు రీజనల్ కో ఆర్డినేటర్ గా సుబ్బారెడ్డి ఉన్నా కూడా సాయిరెడ్డే ఇక్కడ చక్రం తిప్పడం ఖాయం అని తేలిపోయింది.ఇది కూడా బొత్సకు చేదు అనుభవమే ! ఇక బొత్స సామాజిక వర్గంకు చెందిన విశాఖ నేతలకు కూడా సీఎం దగ్గర ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే ముత్తంశెట్టి శ్రీను (అవంతి శ్రీను) ని పర్యాటక శాఖ నుంచి తప్పించి ఆ పదవిని రోజాకు అప్పగించారు. ఇది ఓ విధంగా బొత్స వర్గానికి ఓ షాక్.