ఎన్నో ఏళ్ల నుంచి కులాల ప్రాతిపదిక విడిపోయిన సమాజాన సంస్కరణలు రావడం అన్నది చాలా అంటే చాలా కష్టం. ఒక వర్గం ఒక కులం మాత్రమే రూలింగ్ లో ఉంటోంది అంటే ఏంటి కారణం? అంటే వాళ్లకు మాత్రమే అధికారం దక్కుతుంది అంటే ఏంటి కారణం? ఇవన్నీ ఆలోచిస్తే అనంతబాబు మనకు అర్థం అయి ఉంటాడు. లేదా బొత్స నిన్నటి వేళ ఆయన తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా బయట తిరుగుతున్నాడు అన్న మాట ఎందుకు చెప్పారో కూడా అర్థం అయి ఉంటుంది. లేదా అర్థం అయి తీరుతుంది. ఏదేమయినా ఓ నిండు ప్రాణం పోయాక నిందితుడికి వేసే శిక్ష సత్వర న్యాయానికి సంకేతం అవుతుంది. కానీ దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో ? ఎప్పుడు ఇవి తేలుతాయో అన్నవి చెప్పలేం?
అస్సలు కాని పని.. దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకులు కూడా వీటిని ఎదుర్కొనే ఉండి ఉంటారు. కాస్తో,కూస్తో కొందరు వాటిని దాటుకుని గెలుపు వైపు ప్రయాణించి ఉంటారు. శ్రీకాకుళం వచ్చిన మంత్రి మేరుగ నాగార్జున మాత్రం కాస్త ధైర్యంతోనే మాట్లాడారు. కానీ మంత్రి బొత్స మాత్రం అనంతబాబును వెనకేసుకుని వచ్చారు. అది తప్పు అని ఆయనకు తెలియదా? అంటే తెలుస్తుంది కానీ ఉనికి కోసం ఆయన మాట్లాడి ఉండవచ్చు. ఇదే సమయంలో గుంటూరు పెద్దాయన అంబటి కూడా మాట్లాడారు. ఎందుకిలా మాట్లాడడం ఇప్పుడు మాట్లాడడం వల్ల వైసీపీ కి వచ్చే లాభం ఏంటి ? వీరంతా మౌనంగా ఉండిపోయి ఉంటే ఎంత బాగుండేది.
ఎంతైనా గోదారి కాపులకు తెగువెక్కువ!
శవం డోర్ డెలివరి చేసిన అనంతబాబు
కారంచేడోళ్లు, చుండూరోళ్లను మించిపోయాడు..
అని సీనియర్ జర్నలిస్టు ఒకరు రాశారు. ఆయన కులాల వారిగా ఎన్నో విశ్లేషణలు చేసిన పెద్దాయన.
ఎంత తప్పు ! మన నాయకులు చేస్తున్నది.. నేనే చంపేశా అని ఒప్పుకున్నాక, మన నాయకులు ఇకపై అయినా ఆయన్ను వెనకేసుకుని రావడం మానుకుంటారా? ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పి వ్యవహారం అయి ఉంది. మంత్రులు తప్పులు చేయవచ్చు.కానీ తప్పులు చేసిన వారిని వెనకేసుకుని రావడం తప్పు! ధర్మం తప్పాక తమ్ముడు తన వాడైనా నిలదీయాలి కదా ! కానీ ఎందుకనో బొత్స మాత్రం ఆ పని చేయలేకపోయారు. అంబటి కూడా చేయలేకపోయారు. ఈ విషయమై మిగిలిన మంత్రులు సైలెంట్ అయిపోయారు. ఓ విధంగా మాట్లాడకుండా ఉండి హుందాతనం చాటుకున్నారని అనుకోవాలా లేదా జగన్ ఆదేశాల మేరకు ఆ ఇద్దరే మాట్లాడారని అనుకోవాలా? ఏదేమయినా ఆధిపత్యపు ధోరణల్లో భాగంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది.