టీ20ల్లో 600 వికెట్లు​.. డ్వేన్ బ్రావో​ అరుదైన రికార్డ్​

-

వెస్టిండీస్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన డ్వేన్ బ్రావో మరో మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఏకంగా 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. బ్రావో గతేడాది టీ20 ప్రపంచకప్‌ సమయంలో విండీస్‌ జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. తర్వాత కూడా వివిధ లీగుల్లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లోనూ ఆడుతున్నాడు.

అక్కడ నార్తన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న బ్రావో గతరాత్రి ఓవల్‌ ఇన్విజిబుల్స్‌ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ఈ రికార్డు నెలకొల్పాడు. తొలుత రిలీ రొస్సౌ(48)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేసిన అతడు తర్వాత సామ్‌కరన్‌ (60)ను కూడా బౌల్డ్‌ చేశాడు. దీంతో పొట్టి క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బ్రావో తర్వాత ఈ జాబితాలో అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఉన్నాడు. అతడు మొత్తం 339 మ్యాచ్‌ల్లో 466 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక 2006లో న్యూజిలాండ్‌పై తొలి టీ20 మ్యాచ్‌ ఆడిన ఈ విండీస్‌ మాజీ క్రికెటర్‌ మొత్తం 91 అంతర్జాతీయ టీ20ల్లో 78 వికెట్లు తీశాడు. మిగతా 522 వికెట్లు వివిధ లీగుల్లో తీసినవే. మరోవైపు భారత టీ20 లీగ్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తం 161 మ్యాచ్‌లు ఆడిన ఈ చెన్నై స్టార్‌ 183 వికెట్లు తీసి నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version