ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ఇవాళ్టి మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గెలుపొందగా.. ఆసీస్ పాయింట్ల పట్టికతో రెండో స్థానంలోనే ఉండిపోయింది. దీంతో మొదటి స్థానంలో ఉన్న భారత్ ఈ నెల 9వ తేదీన మాంచెస్టర్‌లో జరగనున్న తొలి సెమీస్ పోరులో 4వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్ మ్యాచుల్లో ఏ జట్టు దేంతో తలపడనుందో తేలిపోయింది. ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుకోగా.. సెమీ ఫైనల్స్‌లో ఎవరు ఎవరితో ఆడాలో మాత్రం తేలలేదు. ఈ క్రమంలోనే ఇవాళ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌తో ఆ వివరాలు కూడా తెలిశాయి. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా ఇవాళ్టి మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గెలుపొందగా.. ఆసీస్ పాయింట్ల పట్టికతో రెండో స్థానంలోనే ఉండిపోయింది. దీంతో మొదటి స్థానంలో ఉన్న భారత్ ఈ నెల 9వ తేదీన మాంచెస్టర్‌లో జరగనున్న తొలి సెమీస్ పోరులో 4వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆసీస్, ఇంగ్లండ్‌లు రెండో సెమీఫైనల్ మ్యాచ్‌ను ఈ నెల 11వ తేదీన బర్మింగ్‌హామ్‌లో ఆడుతాయి.
ఇవాళ శ్రీలంకతో హెడింగ్లీలో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ గెలిచి లీగ్ దశను విజయంతో ముగించగా, సఫారీలు కూడా ఆసీస్‌పై నెగ్గి టోర్నీకి విజయంతో ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా ఇవాళ మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ డుప్లెసిస్ (94 బంతుల్లో 100 పరుగులు, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్‌డర్ డుస్సెన్ (97 బంతుల్లో 95 పరుగులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు)లు రాణించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్‌లకు చెరో 2 వికెట్లు దక్కగా, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ప్యాట్ కమ్మిన్స్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగగా, చివరి ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆలౌట్ అయ్యారు. దీంతో సౌతాఫ్రికా విజయం సాధించింది. కాగా ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ వార్నర్ (117 బంతుల్లో 122 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ కేరే (69 బంతుల్లో 85 పరుగులు, 11 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు తీయగా, ప్రిటోరియస్, పెహ్‌లుక్‌వాయోలకు చెరో 2 వికెట్లు దక్కాయి. అలాగే ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరిస్‌లు చెరొక వికెట్ తీశారు.