డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ భారత స్టార్ రెజ్లర్లు గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ దిల్లీలో నిరసన సాగిస్తున్నారు. ఈ నిరసన దీక్షను ముందుండి నడిపిస్తోన్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
‘చాలాకాలం పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోన్న ఓ శక్తిమంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటం అత్యంత కష్టం. నాలుగు నెలల క్రితం మొదటిసారి ఆందోళన చేపట్టడానికి ముందు మేం ఓ అధికారిని కలిశాం. మహిళా అథ్లెట్లు శారీరకంగా, మానసికంగా ఎలా వేధింపులకు గురవుతున్నారో మొత్తం వివరించాం. కానీ చర్యలు తీసుకోలేదు. అందుకే మేం ధర్నాకు కూర్చున్నాం. అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో మాట్లాడిన తర్వాత నిరసనను నిలిపివేశాం. ఆ సమయంలో లైంగిక వేధింపుల గురించి ఆయనకు చెప్పాం. అయితే కమిటీని ఏర్పాటు చేసి, ఈ వ్యవహారాన్ని అణచివేయాలని మంత్రి ప్రయత్నించారు. బ్రిజ్‌భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని ఫొగాట్ ఆరోపించారు.