తెలంగాణ రాజకీయాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష స్థానంలో ఉన్న రేవంత్…తనదైన శైలిలో రాజకీయం చేస్తూ, అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్నారు. అటు ఎప్పుడు ప్రజల్లో ఉండటానికే చూస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ వ్యూహాలకు ధీటుగా సరికొత్త ఎత్తుగడ వేస్తూ ముందుకెళుతున్నారు. కేసీఆర్, దళితబంధు తీసుకొచ్చి, దళితులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, దానికి కౌంటర్‌గా దళిత, గిరిజన ఆత్మగౌరవం పేరిట భారీ సభలు పెట్టి, వారు కాంగ్రెస్ వైపే ఉన్నారని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే నిరుద్యోగుల సమస్యలు, పోడు భూముల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం పలు అక్రమాలు చేస్తుందని చెప్పి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ విధంగా అన్నీ వైపులా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రేవంత్ ముందుకెళుతున్నారు. కానీ ఏపీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు మాత్రం, రేవంత్ మాదిరిగా పోరాటం చేయడం లేదు.
అక్కడ ఎన్నికలై రెండేళ్ళు దాటిన కూడా చంద్రబాబు ఇంకా ప్రజల మధ్యలోకి రావడం లేదు. ఎంతసేపు జూమ్, సోషల్ మీడియాల్లో మాత్రమే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలాగే దీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఇక టీడీపీ నేతలు జైలుకెళ్లడమో, లేక ఎవరైనా చనిపోతే మాత్రం వారిని పలకరించడానికి చంద్రబాబు బయటకొస్తున్నారు.
ఇంతవరకు ఏపీలో ఓ సమస్యపై భారీ ఎత్తున పోరాటం చేసిన సందర్భం కనిపించడం లేదు. అటు నారా లోకేష్ కూడా అదే తరహాలో ముందుకెళుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, స్టీల్ ప్లాంట్ ఇష్యూ, రాజధాని ఇష్యూ, ఇసుకలో అక్రమాలకు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయి. కానీ వీటిపై ప్రజల్లోకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పోరాటాలు చేయడం లేదు. రేవంత్ మాదిరిగా దూకుడుగా ఉండటం లేదు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే బాబు కూడా రేవంత్ రూట్‌లోకి వచ్చి, ప్రజల్లో ఉంట్ అధికార పక్షంపై పోరాటం చేయాల్సి ఉంటుంది.