ఎన్టీఆర్ స్ఫూర్తి.. చంద్రన్న భరోసా అంటూ 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగారు. చోడవరం మినీ మహానాడులో అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లు మాట్లాడుతూ జనంలో ఉత్సాహం నింపుతూనే కొన్ని తప్పుడు మాటలు కూడా మాట్లాడారు అన్న వాదన ఉంది. ఎప్పటి నుంచో విశాఖ కేంద్రం గా అయ్యన్న రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడాయన భార్య నర్సీపట్నంలో మున్సిపల్ కౌన్సిల్ లో విపక్ష నేత. ఇదొక్కటి తప్ప ఆ కుటుంబానికి పెద్దగా చెప్పుకోదగ్గ రీతిలో రాజకీయ పదవులేం లేవు. అయ్యన్న హయాంలో కూడా కొన్ని తప్పులయితే పాలన పరంగా జరిగాయి. అధికారం కోల్పోయాక అయ్యన్న చాలా నిరుత్సాహానికి గురయ్యారు.
ఆ నిరుత్సాహం నుంచి బయట పడేందుకు కోడెల విగ్రహావిష్కరణ ( ఉమ్మడి గుంటూరు జిల్లా, నరసరావు పేట) సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట అదుపు తప్పింది. ముఖ్యమంత్రిని ఎన్నడూ అనని విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇవే అప్పట్లో సంచలనం అయ్యాయి. ఆ తరువాత కూడా ఆయన స్థాయి వ్యక్తి సీఎంకు క్షమాపణలు అయితే చెప్పలేదు.
చెప్పకపోగా అవే వ్యాఖ్యలు కొనసాగిస్తూ వచ్చారాయన. ఇవే మాటలు మొన్నటి వేళ ఒంగోలు మహానాడులోనూ తరువాత చోడవరం మినీ మహానాడులోనూ మాట్లాడారు. ఇవన్నీ వైసీపీ ప్రతికార చర్యలకు కారణం అయి ఉంటాయి అని పరిశీలకులు అంటున్నారు. అందుకే గోడ కూల్చివేతకు ప్రాధాన్యం ఇచ్చి తద్వారా పసుపు పార్టీ నేతలను హడలెత్తించారు.
ఇప్పుడు టీడీపీలో డైలమా నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు ఇవాళ (సోమవారం, జూన్ 20, 2022) ఛలో నర్సీపట్నం అనే కార్యక్రమం నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు తావిస్తోంది. పోలీసులు సైతం వీళ్లను నిలువరించేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇక ఛలో నర్సీపట్నం హిట్ అయితే టీడీపీకి మరో విజయం దక్కిందనే భావించాలి. లేదంటే వైసీపీ మాట నెగ్గిందని అనుకోవాలి.