తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాదే ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ విమర్శలు ప్రతివిమర్శలకు పనిచెబుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోదీ పర్యటనపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. మోదీని చూసి భయపడిపోయాడంటూ కేసీఆర్ పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు బీజేపీ నేతలు.
తాజాగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మెదక్ జిల్లా కార్యవర్గం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి లక్షల కోట్ల నిధులు తెలంగాణకు వస్తున్నాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం చేస్తానని తిరుగుతున్నాడని.. సీఎం కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. బీజేపీ క్యాడర్ ప్రతీ ఇంటికి వెళ్లి ేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అబద్దాలు మాట్లాడుతుందని ఆరోపించారు. ప్రధాని మోదీని టీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలంలో మాట్లాడుతున్నారని.. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మభ్య పెడుతున్నారని ఆయన విమర్శించారు.