తడి చెత్తతో సేంద్రీయ ఎరువు తయారు చేసి తెలంగాణ మరో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిచిన సిద్దిపేట పట్టణం.. తడి చెత్తతో సేంద్రీయ ఎరువును తయారు చేసింది. ఈ సేంద్రీయ ఎరువు సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ సన్నాహాలు చేస్తుంది. ఈ సేంద్రీయ ఎరువును నల్ల బంగారం అని పిలుస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ.. కార్బన్ మాస్టర్స్ కంపెనీతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజు వెలువడే 60 మెట్రిక్ టన్నుల వ్యర్థాల ద్వారా సీఎన్‌జీని ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు.
ఈ వ్యర్థాల ద్వారా సేంద్రీయ ఎరువును కూడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 15 టన్నుల గార్డెన్ వేస్ట్, 10 టన్నుల ఆహార వ్యర్థాలను ఉపయోగించి బయో గ్యాస్‌ను ఉత్పత్తితో పాటు సేంద్రీయ ఎరువును తయారు చేస్తున్నారు. రోజుకు 100 నుంచి 120 బస్తాల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్బన్ మాస్టర్స్ సహా వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సోమ నారాయణ వెల్లడించారు. ప్రతి ఏడాది 4 వేల నుంచి 5 వేల బస్తాల ఎరువును తయారు చేస్తామన్నారు. 40 కిలోల బస్తా ధరను రూ. 300గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈ ఎరువును మొదటగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విక్రయించాలని యోచిస్తున్నట్లు సోమ నారాయణ పేర్కొన్నారు.