హైదరాబాద్‌లో ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్వేకు రంగం సిద్ధమవుతోంది. ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్‌లో అత్యంత కీలకమైన మెట్రో డిపో ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం ప్యాసింజర్ టర్మినల్ వరకు 31 కి.మీ మేర మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని 9 మెట్రో స్టేషన్‌లతో నిర్మిస్తున్నారు.
మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నా, పనుల ప్రారంభానికల్లా అత్యంత కీలకమైన డిపో, ఆపరేషన్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ముఖ్యంగా మెట్రో రైళ్లను నిలిపి ఉంచేందుకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే హిమాయత్‌సాగర్, రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతాల మధ్య, కొత్వాల్‌గూడ-శంషాబాద్‌ల మధ్య తగినంత స్థలం అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. సుమారు 40 నుంచి 50 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో, ఇతర కార్యకలాపాలకు అవసరం ఉంటుందని మెట్రో అధికారులు ప్రాథమికంగా నిర్ణయించుకొని స్థలాన్వేషణ చేస్తున్నారు.