బాసర సరస్వతి ఆలయంలో జరిగిన చోరీ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ చోరీ పై ఉన్నతాధికారుల సీరియస్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఆలయంలోని దత్తమందిరం ముందున్న హుండిలో నగదు చోరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆలయంలో విధులు నిర్వహించే ఆరుగురు హోంగార్డుల పై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నారు అధికారులు. వారిని ఆలయ విధుల నుంచి తొలగించారు.
ఎస్పీ కార్యాలయంకు ఆ ఆరుగురు హోంగార్డులను అటాచ్ చేసారు ఉన్నతాధికారులు. అయితే ఈ దొంగతనం అనంతరం బాసర ఆలయం భద్రత పై జిల్లా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఆలయంలో అదనంగా సీసీకెమెరాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇక నుంచి ఏ ఎస్పి పర్యవేక్షణలో బాసర టెంపుల్ ఉండనుంది. అలాగే నెలకొసారి ఆలయ భద్రత పై ఎస్పీ సమీక్ష నిర్వహించనున్నారు. ఆలయ అధికారుల నుండి ఎప్పటికప్పుడు భధ్రత వివరాలు తెలుసుకుంటూ.. అందులో చేయాల్సిన మార్పుల విషయంలో చర్చించనున్నారు.