మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్తు కు ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈడి, ఐటి దాడుల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని మండిపడ్డారు. మేని ఫెస్టోలోని పథకాలను అమలు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని.. ప్రధాని నరేంద్ర మోడీకి మోసాల మోడీ అని నామకరణం చేయాలని సూచించారు.
దేశ రాజ్యాంగాన్ని మార్చడం సిగ్గుచేటు అని.. దేశ సంపద కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టకుండా ప్రజలందరికీ చెందాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్ష రాజకీయాలు చేయాలి గాని, సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.