రాష్ట్రంలో ఇంత పంట పండిందంటే దానికి కారణం సీఎం కేసీఆర్ పుణ్యమే అని అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం భాషాయిగూడెం – తిమ్మాయిపల్లి గ్రామంలో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మారిందని, సీఎం కేసీఆర్ రైతుకు విలువ పెంచారని అన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉండేవని.. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, రైతు పండించిన ధాన్యం ఒక్క గింజ లేకుండా కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. కాలేశ్వరం పూర్తి కావడం వల్లే వేల టన్నుల ధాన్యం పండుతుందని గుర్తు చేశారు. అలాగే గిట్టుబాటు ధర కూడా ఇస్తుందని తెలిపారు. పక్క రాష్ట్రంలో వరి ధాన్యం కొనడం లేదని మంత్రి విమర్శించారు.