రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ రాజభోగాల ఆకలి ఇంకా తీరలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ఏదైనా ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయదలచుకుంటే.. ఏనాడైనా గ్రామ సభలు నిర్వహించరా..? అని ప్రశ్నించారు. గతంలో రైతులపై కూడా దాడులు చేయించారని గుర్తు చేశారు. రైతులనే రెచ్చగొట్టి కలెక్టర్, అధికారులపై కూడా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
మల్లన్నసాగర్ లో రైతులను కొట్టి భూములను లాక్కున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు కుట్రలు చేశారని.. అధికారం కోల్పోయిన తరువాత కూడా బీఆర్ఎస్ నేతలు అదే పని చేస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా భూములను లాక్కొనే ఆలోచన ప్రభుత్వానికి లేనే లేదన్నారు. సర్కార్ ను బద్ నాం చేసేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని తెలిపారు.