గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తన రాజకీయ భవిష్యత్ గురించి మాట్లాడారు. ప్రాణం పోయినా సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని అన్నారు. చచ్చినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరనని స్పష్టం చేశారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయటమే తన లక్ష్యమని రాజా సింగ్ అన్నారు. బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తా కానీ.. స్వతంత్రంగా లేదా, ఇతర పార్టీల నుంచి పోటీ చేయనని తేల్చి చెప్పారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉందని.. మజ్లిస్ నిర్ణయం కోసమే గోషామహల్ పెండింగ్ పెట్టారని అన్నారు. బీజేపీ అధిష్ఠానం తనపై సానుకూలంగా ఉందని.. సరైన సమయంలో తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఇప్పటికే రాజాసింగ్‌పై పలు పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధిష్ఠానం ఆయణ్ను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పటివరకు రాజాసింగ్ సస్పెన్షన్‌పై అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయానికి రాలేదు.