రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జారీ చేసిన జీవో నెం. 33 విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన జీవో 33ను హైకోర్టు సమర్థించింది. పిటిషనర్ల స్థానికతను నిర్ధారించుకున్న తరువాతనే వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు విద్యార్థుల స్థానికత పై దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా కాదా అన్నది పరిశీలించాలని హైకోర్టు సూచించింది.
ప్రస్తుతం మార్గదర్శకాలు లేనందున కొత్తగా రూపొందించుకుని వాటిని పాటించాలని కాలోజీ వర్సిటీని ఆదేశించింది హైకోర్టు. స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 33ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని, ఇతర ఎవరైనా తెలంగాణలో ఇంటర్, దానికి ముందు రెండేళ్లు తెలంగాణలో చదివితే వారికి స్థానిక కోటా వర్తింపజేయడం అన్యాయం. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి నష్టం కలుగుతుందని వాదించారు. వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవో ను సమర్థించింది.