దారుణం.. యువకుడిని చంపి ఇన్‌స్టాలో సెల్ఫీ వీడియో

-

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ఎస్‌ఆర్‌ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్‌ (21) అలియాస్‌ సిద్ధూ.. ఆ కేసులో జైలుకు వెళ్లి రెండు నెలల క్రితం విడుదలయ్యాడు. ప్రస్తుతం ప్రగతినగర్‌లోని అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి సిద్ధూ తల్లి ఊరు వెళ్లగా.. ఒంటరిగా ఉన్న అతడు.. తన మిత్రులైన మహేశ్‌, శివప్ప, సమీర్‌తో కలిసి మద్యం తాగాడు.

సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రగతినగర్‌లోని బతుకమ్మ ఘాట్‌ ఎదురుగా నిలబడి ఉండగా.. గతంలో హత్యకు గురైన తరుణ్‌ స్నేహితులు సుమారు 20 మంది ద్విచక్రవాహనాలపై వచ్చి తేజస్‌ను కత్తులతో పొడిచి చంపారు. హత్య తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో ద్వారా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి తరుణ్‌ హత్యకు ప్రతీకారంగా తమ పగ నెరవేర్చుకున్నామంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, బాచుపల్లి సీఐ జె.ఉపేందర్‌యాదవ్‌ ఈ కేసుకు సంబంధించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version