హైదరాబాద్ లో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కాబోతుందని తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. తైవాన్ నుంచి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా తెలంగాణా ఐటీ, పరిశ్రమల శాఖ, తైవాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TCC) సంస్థలు ద్వైపాక్షిక సహకార ఒప్పందపై సంతకాలు జరిగాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త ఉద్యోగాల కల్పన ఉంటుందని తెలిపారు ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ విష్ణవర్ధన్ రెడ్డి.
మంగళవారం నాడు రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐజీ) కార్యాలయంలో ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ విష్ణవర్ధన్ రెడ్డి, టీసీసీ ఉపాధ్యక్షుడు సైమన్ లీ మధ్య ఈ ఎంఓయూ జరిగింది. తైవాన్ నుంచి పెట్టుబడులను రాబట్టేందుకు టీసీసీ హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు కానుందట. తైవాన్ కంపెనీలు రాష్ట్రంలోకి ప్రవేశించడంలో టీసీసీ కీలక మాధ్యమంగా నిలుస్తుంది. హైదరాబాద్ లో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఇప్పటికే రూపకల్పన జరిగింది. మార్కెట్ ఎంట్రీ అధ్యయనాలు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిచడం, తెలంగాణాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.