పునరావాస కేంద్రాల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : తెలంగాణ హైకోర్టు

-

మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారికి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. మానసిక ఆరోగ్య చట్టం-2017 అమలు తీరుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు, మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారి స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. ఇందుకోసం ఈ సంస్థను ప్రతివాదిగా చేర్చుతూ ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఆరోగ్య చట్టం అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ న్యూ లైఫ్‌ సొసైటీ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఇన్‌సెడ్‌) స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పద్మారావు వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో మానసిక ఆరోగ్య చట్టం సరిగా అమలు కావడంలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం దివ్యాంగుల సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌, డీఎంఈ, సంగారెడ్డి కలెక్టర్‌లకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ వ్యాజ్యానికి నంబరు కేటాయించాలంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version