రైతు ఉద్యమంపై మౌనంగా తెలుగు సినిమా..కారణం ఇదేనా!

-

కెమెరా ముందు రైతు గురించి చెప్పమంటే.. రైతే రాజు.. దేవుడంటూ పొగిడేస్తారు మన హీరోలు. దేశానికి వెన్నుముక అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. అదే వాళ్లకు కష్టం వస్తే మాత్రం.. కనీసం చిన్నపాటి ట్వీట్ చేసి ఓదార్చరు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతు దగ్గరకు వెళ్లపోయినా ఫర్వాలేదు. కనీసం.. నాలుగు మాటలతో అండగా నిలవలేదు. రైతు కథలతో సూపర్‌హిట్‌ కొడతారు. రియల్‌ లైఫ్‌లో మాత్రం రైతును గుర్తుపెట్టుకోరా? వ్యవసాయం చట్టంను వ్యతిరేకిస్తున్న రైతులు గోడు మన హీరోలకు ఎందుకు పట్టడం లేదు?

వ్యవసాయ చట్టం కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వున్నాయని.. వ్యవసాయరంగాన్ని నష్టపరిచేలావుందని రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారంనాడు భారత్ బంద్‌కు పిలుపిచ్చారు. దాదాపుగా రాజకీయపార్టీలు రైతుల ఆందోళనకు మద్దతు పలికాయి. కానీ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కనిపించలేదు. ప్రతి హీరో రైతుగా కనిపించి.. డైలాగ్స్‌ ఇరగదీసినవారే. రైతుగా నటించే అవకాశం దక్కపోయినా.. ఏదో ఒక సందర్భంలో రైతు గొప్పదనం చాటినవారే ఇప్పుడు మౌనంగా వుండిపోయారు. సోషల్‌ మీడియాలో రైతు గురించి ఒక్క పోస్ట్‌ కూడా పెట్టకపోవడం రైతు మద్దతుదారులకు అస్సలు నచ్చలేదు.

పదేళ్ళ విరామం తర్వాత .. రీ ఎంట్రీ కోసం చిరంజీవి రైతు కథనే నమ్ముకుని ఖైదీ నంబర్ 150లో నటించాడు. కథలోని రైతుల కన్నీటి గాధలకు చిరు కన్నీరు పెట్టుకుంటే.. ప్రేక్షకుడు కూడా కంటితడి పెట్టారు. ఈ రైతు కథతో 100 కోట్లు రాబట్టాడు నిర్మాత రామ్‌చరణ్‌. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో రైతుల గురించి చాలా చెప్పిన మెగాస్టార్‌కు రైతుల ఆందోళన పట్టకపోవడం.. వాళ్లకు మద్దతుగా ఒక్క ట్వీట్‌ పెట్టకపోవడం రైతుల్లో వున్న మెగాఫ్యాన్స్‌కు అర్థం కావడం లేదు.

రైతు కథతో హిట్‌ కొట్టిన మరో హీరో మహేశ్‌బాబు. పదర పదర అంటూ.. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగుల్లో వీకెండ్‌ ఫార్మింగ్‌ చేయించాడు మహర్షి. మహేశ్‌బాబు పొలంలోకి దిగి నాట్లు వేస్తే.. ఇంతవరకు పొలంలోకి అడుపెట్టని వాళ్లు కూడా.. నాట్లు వేసి రైతుగా ఫీలయ్యారు. 2019లో ఎక్కువ వ్యూవ్స్‌ వచ్చిన హ్యాష్‌ ట్యాగ్‌గా మహర్షిని నిలిపారు జనాలు. రైతు కథ మహర్షిని హిట్‌ చేస్తే.. ఆ మహర్షి మాత్రం రైతు గురించి మర్చిపోయాడు.

మనవాళ్ల హీరోయిజం అంతా తెరపైనేనా? కెమెరా వెనకాల చాలా పిరికోళ్లు అంటున్నారు నెటిజన్లు. వ్యవసాయ చట్టంను వ్యతిరేకిస్తే.. మోడీని వ్యతిరేకించినట్టే అన్న కాన్సెప్ట్‌తో వున్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక్క ట్వీట్‌ చేస్తే.. మోడీ దృష్టిలో శత్రువు అవుతామన్న భయం కాబోలు. వ్యవసాయ చట్టంతో లబ్దిపొందే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీని వ్యతిరేకించినట్టేనన్న లెక్కతో రైతు ఆందోళన వీళ్లకు పట్టడం లేదంటూ సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

ఇక బాలయ్య అయితే.. రైతులంటే చాలా రెస్పెక్ట్ అంటాడు. ఏకంగా వాళ్ల కోసం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ అనే సినిమా తీయాలనుకున్నాడు. ఓ ముఖ్య పాత్ర కోసం అమితాబ్‌ను బాలయ్య కలిసినా.. ఈ ప్రాజెక్ట్‌ వర్కవుట్ కాలేదు. రూలర్‌ మూవీలో రైతు గురించి అదిరిపోయే డైలాగ్‌ చెప్పిన బాలయ్య.. రియల్‌ లైఫ్‌లో అండగా నిలవలేకపోయాడు. రైతు కష్టాలు పవన్‌కల్యాణ్‌కు తెలీంది కాదు. ఫామ్‌ హౌస్‌లోని రెండు ఎకరాల్లో వరి పండించే పవన్‌.. ప్రస్తుతం బిజెపికి మద్దతు ఇవ్వడంతో.. దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంకు సపోర్ట్‌ చేయలేకపోతున్నాడా? రైతుల బాగోగులు కోరుకునే పవన్‌ నుంచి మద్దతు లేకపోవడం ఫ్యాన్స్‌కు కూడా షాకే.

పెద్దహీరోలకు రాజకీయ పార్టీలు..ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు వుండడంతో.. రైతు బంద్‌కు సపోర్ట్‌ చేయలేదనుకుంటే.. యంగ్ హీరోలు సైతం ఇదే దారిలో నడుస్తున్నారు. తుఫాన్‌.. వరదలు.. ప్రమాదాల సమయంలో ఇట్టే స్పందిస్తే.. నటీనటులు రైతు ఊసెత్తడం లేదు. రైతు బాధ తెలియడం లేదా? భయపడుతున్నారా? అన్నది వాళ్లకే వదిలేశామంటున్నారు ఫార్మర్స్‌.

అదేమిటోగానీ.. సీనియర్‌ హీరోలు సైతం రైతుల విషయంలో గమ్ముగా తమకేదీ పట్టనట్టు వున్నారు. తెరపైన రైతుల గురించి చెప్పమంటే.. ఎక్కడలేని ఎమోషన్‌తో.. మాడ్యులేషన్‌తో గూజ్‌ బంప్స్‌ వచ్చేలా జీవిస్తారు. నిజ జీవితంలో మాత్రం రైతు అనే మాట ఎత్తడానికే మనసు రావడంలేదంటూ.. నెట్‌లో ట్రోలింగ్‌ కూడా వీళ్ల మనసు మార్చడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news