తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టో ను అక్షరాలా అమలు చేస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. గాంధీభవన్ లో మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరుతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ కి అధికారం ఇవ్వాలని ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. మార్పు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు తగ్గించేశారని.. ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ పరస్పరం విమర్శలు మానేశారని అన్నారు.
కేసీఆర్ పదవీ విరమణ టైమ్ వచ్చేసిందని.. ఎద్దేవా చేసారు. ఓడిస్తే.. ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ అంటున్నారని.. దీంతో ఓటమి తప్పదనే విషయం ఆయనకు అర్థం అయిపోయిందన్నారు. కేసీఆర్ కి టాటా.. బాయ్ బాయ్ చెప్పి ఇంటికి పంపిస్తామని సెటైర్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట సాగిన కుంభకోణాలను జనం అర్థం చేసుకున్నారన్నారు. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు. ఎంతో మంతి ప్రాణాలు కోల్పోయారు. కానీ తెలంగాణ తెచ్చిన లాభం కేసీఆర్ ఒక్కరే అనుభవించారని మండిపడ్డారు. కర్నాటకలో 5 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తున్నాం. తెలంగాణలనూ ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.