కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు వసతులు కల్పించేందుకు ఇందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఉదయం 10.45 గంటలకు పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద మల్లికార్జునుడు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ కల్యాణం జరుగనుంది. ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు, వధువుల మేడలాదేవి, కేతమ్మదేవీ తరఫున మహదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపిస్తారు. ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కల్యాణ వేడుకకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతారు.
రెండు రోజులపాటు జరుగనున్న కల్యాణోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటలకు స్వామి వారికి దృష్టికుంభం (బలిహరణం) నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7గంటలకు రథోత్సవం (బండ్లు తిరుగుట), 19వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.